త‌లుపులు మూసిన‌ప్పుడు అంత జ‌రిగిందా స‌బ్బం?

Update: 2018-07-06 08:46 GMT
విభ‌జ‌న వేళ‌.. నోరు విప్ప‌ని చాలామంది ఆంధ్రా ప్రాంతానికి చెందిన నాయ‌కులు.. నాలుగేళ్ల త‌ర్వాత నోరు విప్పుతున్న వైనం చూస్తున్న‌దే. విభ‌జ‌న వేళ‌.. ఏపీకి అన్యాయం జ‌రిగిందంటే.. అప్పుడు నోరు మూసుకొని.. ఇప్పుడు నోరు తెరిచి మాట్లాడుతున్న వారే వ‌ల్ల‌నే. అప్ప‌ట్లో ఏం జ‌రిగిందో తెలుసా?.. విభ‌జ‌న బిల్లు లోక్ స‌భ‌లో చోటు చేసుకున్న ప‌రిణామాల్ని ఇప్పుడు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు చెబుతున్న వారు.. అప్ప‌ట్లో ఏం చేశారంటే మాత్రం నోరు విప్ప‌ని ప‌రిస్థితి.

ఏపీకి చెందిన నేత‌ల్లో దాదాపుగా అంద‌రికి హైద‌రాబాద్‌లో ఆస్తులు ఉండ‌టం.. తాము మాట్లాడే మాట‌లు తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఆస్తుల మీద ప్ర‌భావం చూపిస్తుంద‌న్న ఆలోచ‌న కూడా ఏపీ నేత‌ల నోటిని మూసేలా చేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇప్పుడు కూడా మాట్లాడ‌క‌పోతే రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఉండ‌ద‌న్న భ‌యంతో.. అవ‌స‌రానికి త‌గ్గట్లు మాట్లాడుతున్న వారిని చూస్తే ఏవ‌గింపు క‌ల‌గ‌క మాన‌దు.

ఎవ‌రి వ‌ర‌కో ఎందుకు.. మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి ముచ్చ‌టే తీసుకోండి. సూటిగా మాట్లాడ‌తార‌న్న పేరున్న ఆయ‌న‌.. విభ‌జ‌న వేళ ఏపీకి జ‌రిగిన న‌ష్టం మీద పెద్ద‌గా మాట్లాడింది లేదు. ఆ మాట‌కు వ‌స్తే.. విభ‌జ‌న బిల్లు పాస్ చేసే సంద‌ర్భంగా త‌లుపులు మూసిన‌ప్పుడు ఏం జ‌రిగింద‌న్న‌ది కూడా బ‌య‌ట‌కు చెప్ప‌లేదు.

నాలుగేళ్ల త‌ర్వాత మ‌రో ఏడాదిలో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ‌.. ఎన్నిక‌ల బ‌రిలో దిగేందుకు రెఢీ అవుతున్న ఆయ‌న‌కు త‌లుపులు మూసి విభ‌జ‌న బిల్లును పాస్ చేసిన‌ప్పుడు లోక్ స‌భ‌లో ఏం జ‌రిగిందన్న‌ది గుర్తుకు వ‌చ్చింది. తాము తీవ్రంగా పోరాడామ‌ని.. మాట‌ల్లో చెప్ప‌లేని రీతిలో నాడు ప‌రిస్థితి ఉంద‌ని.. కానీ తాము చెప్ప‌లేదు కానీ.. తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న‌ట్లుగా చెప్పారు.

స‌భ‌లో త‌మ‌పై భౌతిక‌దాడి జ‌రిగిన‌ట్లుగా చెబుతున్న స‌బ్బం.. ఏపీ కోసం తాము పోరాడిన‌ట్లుగా ఇప్ప‌టి నేత‌లు అస్స‌లు పోరాడ‌టం లేద‌న్న మాట స‌బ్బం నోటి నుంచి రావ‌టం చూస్తే.. నాలుగేళ్ల త‌ర్వాత ఆయ‌న‌కు విభ‌జ‌న బిల్లు పాస్ నాటి ముచ్చ‌ట్లు ఎందుకు గుర్తుకొచ్చిన‌ట్లు అన్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు. ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం త‌న లాంటి తోపులు త‌హ‌త‌హ‌లాడారే కానీ.. ఇప్ప‌టివారు ఏమీ చేయ‌టం లేద‌న్న‌మాట‌తో త‌న రాజ‌కీయ మైలేజీ పెంచుకోవ‌టం మిన‌హా మ‌రింకేమీ లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

త‌లుపులు మూసేసిన వేళ‌.. దారుణ‌మైన అవ‌మానం జ‌రిగింద‌న్న భావోద్వేగ వ్యాఖ్య‌లు ఇప్పుడు చెప్పే క‌న్నా.. విభ‌జ‌న వేళ‌లో చెప్పి ఉంటే ప‌రిస్థితి మ‌రోలా ఉండేది. అప్పుడు నోరు విప్ప‌నిది ఏపీ ప్ర‌జ‌ల మంచి కోస‌మే అయి ఉంటే.. ఇప్పుడు కూడా అలా నోరు మూసుకొని ఉండి ఉంటే మంచిద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అప్పుడు చేయలేనిది ఇప్పుడు కూడా ఏమీ చేయ‌లేని ప‌రిస్థితే ఉంది. లేనిపోని అపోహ‌ల‌కు తెర తీసేలా మాట్లాడే క‌న్నా మౌనంగా ఉండ‌టం మేలు క‌దా?



Tags:    

Similar News