సైకిల్ ఎక్కేందుకు స‌బ్బం రెఢీ!

Update: 2018-04-11 05:17 GMT
రాజ‌కీయాల్లో అనుభ‌వం ఉంటే స‌రిపోతుందా? ఎప్పుడేం చేస్తారో తెలీన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే ఏపీ రాజ‌కీయ నేత స‌బ్బం హ‌రికి  ఇప్పుడు సైకిల్ మోజు ప‌ట్టుకుంది. విశాఖ‌ప‌ట్నానికి మాజీ మేయ‌ర్ గా.. అన‌కాప‌ల్లి మాజీ ఎంపీగా వ్య‌వ‌హ‌రించిన స‌బ్బం ఇప్ప‌టికే ప‌లు పార్టీలు మారారు. తాజాగా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు చెబుతున్నారు. స‌బ్బంలో విల‌క్ష‌ణ‌మైన కోణం ఏమిటంటే.. తానుండే పార్టీ అధినాయ‌క‌త్వానికి షాకులు ఇస్తారు.

వారు ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేలా చేయ‌టంలో స‌బ్బం స్పెషాలిటీ. విశాఖ మేయ‌ర్ గా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న కొన్నాళ్లు కాంగ్రెస్ కు దూరంగా ఉన్నారు. 2009 ఎన్నిక‌ల్లో అనూహ్యంగా అన‌కాప‌ల్లి కాంగ్రెస్ లోక్ స‌భ టికెట్ సాధించిన ఆయ‌న ప్ర‌జారాజ్యం పార్టీ అభ్య‌ర్థి అల్లు అరవింద్ ను ఓడించ‌టం ద్వారా సంచ‌ల‌నం సృష్టించాడు. నియోజ‌క‌వ‌ర్గంలో త‌న స‌త్తా ఎంత‌న్న విష‌యాన్ని చెప్పేశాడు.

కాంగ్రెస్ ఎంపీగా వ్య‌వ‌హ‌రిస్తూ.. ఆ పార్టీ అధినాయ‌కత్వానికి మింగుడుప‌డ‌ని రీతిలో ఆయ‌న వ్య‌వ‌హార‌శైలి ఉండ‌టం.. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో పార్టీకి వ్య‌తిరేకంగా చేసిన వ్యాఖ్య‌ల‌తో ఆయ‌న‌పై బ‌హిష్క‌ర‌ణ వేటు ప‌డింది. విభ‌జ‌న నాటి ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో స‌బ్బం అలా వ్య‌వ‌హ‌రించి ఉంటార‌ని అనుకుంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి స‌న్నిహితంగా వ్య‌వ‌హ‌రిస్తూ హ్యాండ్ ఇవ్వ‌టం ఆయ‌న తీరుపై సందేహాలు వ్య‌క్త‌మ‌య్యేలా చేసింది.

వైఎస్ కు వీరాభిమానిగా చెప్పుకునే స‌బ్బం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో స‌న్నిహితంగా ఉంటూనే.. ఆ త‌ర్వాత త‌న దారిన తాను వెళ్లిపోయారు. అంతేనా.. విభ‌జ‌న నేప‌థ్యంలో మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి పెట్టిన జై స‌మైక్యాంధ్ర పార్టీలో చేరారు. ఆ పార్టీ త‌ర‌ఫున విశాఖ ఎంపీగా పోటీ చేసేందుకునామినేష‌న్ సైతం వేశారు. అనూహ్యంగా వెన‌క్కి త‌గ్గి.. టీడీపీ.. బీజేపీ ఉమ్మ‌డి అభ్య‌ర్థి అయిన హ‌రిబాబుకు త‌న మ‌ద్ద‌తును ప్ర‌క‌టించారు.

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌ర్వాత నుంచి క్రియాశీల రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న ఆయ‌న‌.. టీడీపీలో చేర‌తార‌ని ప‌లుమార్లు ప్ర‌చారం జ‌రిగింది. అయితే.. ఆయ‌న త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించ‌లేదు. తాజాగా టీడీపీ వైపు ఆయ‌న మొగ్గు చూపుతున్న‌ట్లుగా చెబుతున్నారు. విశాఖ‌ప‌ట్నం టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగేందుకు స‌బ్బం ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. పార్టీలో చేరేందుకు బాబు నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేసింద‌ని.. సైకిల్ ఎక్కేసే రోజు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు. ఇప్ప‌టికే తాను ప్రాతినిధ్యం వ‌హించిన పార్టీల‌కు షాకులిచ్చిన స‌బ్బం.. రానున్న రోజుల్లో చంద్ర‌బాబుకు మ‌రెలాంటి షాకులు ఇస్తారో చూడాలి.
Tags:    

Similar News