అణుయుద్ధం చేస్తే..పీఓకే మ‌న‌దే

Update: 2018-06-24 11:04 GMT
కాంగ్రెస్ సీనియర్ సైఫుద్దీన్ సోజ్ మ‌రోమారు పాక్ ఆక్రమిత కాశ్మీర్(POK)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీరీలు తమ స్వాతంత్య్రానికే తొలి ప్రాధాన్యతనిస్తారంటూ పాకిస్థాన్ మాజీ సైనిక పాలకుడు ముషారఫ్ గతంలో చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ రెండ్రోజుల క్రితం వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. ``కశ్మీరీలకు తమ అభిప్రాయాల్ని వెల్లడించే స్వేచ్ఛను కల్పిస్తే స్వాతంత్య్రానికే వారు తొలి ప్రాధాన్యతనిస్తారని గతంలో ముషారఫ్ చేసిన వ్యాఖ్యలకు నేను కట్టుబడి ఉన్నా. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అది నిజమేనని అనిపిస్తోంది. కశ్మీరీల తొలి ప్రాధాన్యం స్వాతంత్య్రమే. ఇది వాస్తవం.`` అని సైఫుద్దీన్ సోజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. అయిన‌ప్ప‌టికీ ఈ కాంగ్రెస్ సీనియర్ నేత త‌న దూకుడు ఏ మాత్రం త‌గ్గించుకోకుండా మ‌రో సంచ‌ల‌న కామెం చేశారు.

తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ భారత్-పాక్ ల మధ్య న్యూక్లియర్ వార్ జరిగితే తప్ప పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌ భారత్‌లో భాగమవదన్నారు. భారత్ కాశ్మీర్ వ్యాలీని పాలిస్తున్నట్లుగానే పాకిస్ధాన్ కూడా పీఓకేనిని పరిపాలిస్తుందన్నారు. కశ్మీర్ ప్రజలు పాకిస్ధాన్‌ లో కలవాలనుకోవ‌డంలేదని - మొదట తమకు స్వాతంత్ర్యం కావాలని కోరుకుంటున్నారని పాకిస్ధాన్ మాజీ అధ్యక్షుడు ఫర్వేజ్ ముషారఫ్ వ్యాఖ్యలు స‌మ‌స్య‌కు ప‌రిష్కార‌మ‌ని సైఫుద్దీన్ అన్నారు.పీవోకే భారత్ సొంతమవ్వాలంటే రెండుదేశాల మధ్య అణుయుద్దం తప్పనిసరి అని ఆయన తెలిపారు.  అప్పుడే ఈ వివాదానికి ప‌రిష్కారం దొరుకుతుంద‌న్నారు.

ఇదిలాఉండ‌గా...రాష్ట్రంలో విశ్వాసాన్ని పాదుకొల్పే చర్యలు తీసుకోవాలని, అసెంబ్లీని రద్దుచేసి ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని గవర్నర్ ఎన్ ఎన్ వోహ్రాకు ఎన్‌సీ సహా పలు పార్టీలు విజ్ఞప్తిచేశాయి. మెరుగైన పరిపాలన కోసం సలహాలు - సూచనలు అందించేందుకు శుక్రవారం అఖిలపక్ష సమావేశాన్ని గవర్నర్ నిర్వహించారు.
Tags:    

Similar News