వచ్చే ఎన్నికల ఫలితాలపై సజ్జల హాట్‌ కామెంట్స్‌ వైరల్‌!

Update: 2022-12-19 11:30 GMT
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ వైసీపీ ప్రభుత్వం ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనని.. వైసీపీ అధికారంలోకి రాదని తేల్చిచెప్పారు. ఇందుకు సంబంధించి తన వ్యూహం తనకు ఉందన్నారు.

ఈ వ్యాఖ్యలపై వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి హాట్‌ కామెంట్స్‌ చేశారు. గత ఎన్నికల సమయంలో కూడా పవన్‌ కళ్యాణ్‌ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తాను అన్నారని.. జగన్‌ ను అధికారంలోకి రానీయబోనని అన్నారని.. అయితే ఏం జరిగిందో రాష్ట్రమంతా చూసింది అంటూ సజ్జల సెటైర్లు వేశారు. ఎన్నికల ఫలితాలను నిర్ణయించేది చంద్రబాబో, పవన్‌ కల్యాణో కాదన్నారు. ఎన్నికల ఫలితాలను ప్రజలు నిర్ణయిస్తారు అన్న స్పృహ కూడా పవన్‌ కల్యాణ్‌కు లేదని సజ్జల ఎద్దేవా చేశారు.

వెఎస్‌ జగన్‌ మళ్ళీ అధికారంలోకి రాకుండా చూసేది పవన్, చంద్రబాబు కాదన్నారు. లబ్దిదారులైన రైతులు, వృద్ధులు, మహిళలు, డ్వాక్రా మహిళలు వద్దనుకుంటేనే జగన్‌ అధికారంలోకి రాకుండా ఆపగలుగుతారన్నారని సజ్జల తెలిపారు. జగన్‌ కూడా తాను చేసిన సేవ బాగుంటేనే ఓటు వేయమని ప్రజలను అడుగుతున్నారని గుర్తు చేశారు. ఒక్కోసారి ఒక్కోలాగా మాట్లాడుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. కానీ, టీడీపీని మాత్రం ఎప్పుడూ ఒక్క మాట కూడా పవన్‌ అనడం లేదని ధ్వజమెత్తారు.

జగన్‌ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం అయినా ఇచ్చిందా అని పవన్‌ అడుగుతున్నారన్నారు. లక్షకు పైగా సచివాలయ ఉద్యోగాలు, వైద్య ఆరోగ్య శాఖలో 40 వేల ఉద్యోగాలు పవన్‌కు కనిపించటం లేదా? అని నిప్పులు చెరిగారు. అపరిపక్వత, మూర్ఖత్వం, అజ్ఞానంతో పవన్‌ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పవన్‌ ఎవరి తరపున మాట్లాడుతున్నారో అర్థం అవుతుందని విమర్శించారు. చంద్రబాబు తరపున మాట్లాడుతున్నట్లు పవన్‌ కల్యాణ్‌ ధైర్యంగా చెప్పాలని సవాల్‌ విసిరారు.

సినిమా అభిమానులతో చప్పట్లు కొట్టించుకునేందుకు పవన్‌ ఏదేదో మాట్లాడుతున్నారు అని సజ్జల ఎద్దేవా చేశారు. పవన్‌.. చంద్రబాబు ఏజెంటని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు తయారు చేసిన స్క్రిప్టును పవన్‌ చదువుతున్నారని విమర్శించారు. కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేకుండా సీఎం జగన్‌ సాయం అందిస్తున్నారని సజ్జల చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలో ఎవరైనా పోటీ చేయొచ్చని సజ్జల స్పష్టం చేశారు. పాల్‌ రావచ్చు.. పవన్‌ కల్యాణ్‌ రావొచ్చు.. వచ్చి పోటీ చేయొచ్చని తెలిపారు. అవినీతికి హాలిడే ఇచ్చారని పవన్‌ కల్యాణ్‌ పంచ్‌ డైలాగ్‌ లు మాట్లాడుతున్నారని సజ్జల మండిపడ్డారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ ను పవన్‌ చూసి చదువుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News