చీఫ్ జస్టిస్ మాటల్ని మరిచి.. ‘దాదాగిరి’ మాటపై విరుచుకుపడాలా సజ్జల

Update: 2021-08-03 03:43 GMT
ఆవేశానికి ఒక అర్థం ఉండాలి. ఎదుటి వ్యక్తి రెచ్చగొట్టటం.. సంయమనం కోల్పోయేలా మాటల తూటాల్ని సంధించటం అదో వ్యూహం కాదా? ఆ మాత్రం దానికే విరుచుకుపడాలా? ఆవేశంతో ఢీ కొట్టాలని ప్రయత్నించిన వేళ.. అందుకు ఆవేశమే సమాధానం ఎట్టి పరిస్థితుల్లో కాకూడదు. ఈ లాజిక్ ను ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి. గడిచిన కొద్దిరోజులుగా  కృష్ణా జలాల అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగా ప్రయత్నించినా.. తెలంగాణ ప్రజానీకం స్పందించిన తీరు.. జలాల చౌర్యంపై ఏపీ వ్యవహరిస్తున్న తీరుపై ఆయన వ్యాఖ్యలకు పెద్దగా స్పందన రాని పరిస్థితి.

దీనికి కారణం.. అసలు కంటే కొసరు కారణమే.. ఈ రచ్చకు కారణమన్న భావన నెలకొని ఉండటంతోనే.. తెలంగాణ ప్రజలు పెద్దగా స్పందించలేదన్న మాట వినిపిస్తోంది. ఇలంటివేళలో.. కేసీఆర్ వ్యాఖ్యల్ని తిప్పికొట్టటం.. వాస్తవాలు ఏమిటో అందరికి అర్థమయ్యేలా చెప్పటం చాలా అవసరం. అయితే.. ఈ విషయాన్ని వదిలేసి.. కేసీఆర్ మాటలకు ఘాటుగా రియాక్టు కావటమే సమస్యకు పరిష్కారమని భావించి కీలక వ్యాఖ్యలు చేసిన సజ్జల తొందరపాటుకు గురయ్యారన్న మాట వినిపిస్తోంది.

జలవివాదానికి సంబంధించిన సోమవారం పలు కీలక అంశాలు చోటు చేసుకున్నాయి. ఇందులో మొదటిది ప్రధానమైనది.. జలవివాదం సుప్రీం వరకు వెళ్లటం.. సోమవారం ఇది సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ బెంచ్ కు వెళ్లటం.. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. ఇరు వర్గాలకు చెందిన లాయర్లను ఉద్దేశిస్తూ.. రెండు రాష్ట్రాలకు చెందిన వారు కూర్చొని మాట్లాడుకోవాలని.. సమస్యను పరిష్కారం చేసుకోవాలన్నారు. ఈ వ్యాఖ్యలు అందరికి ఆమోదయోగ్యంగా మారాయి.

సరిగ్గా ఇదే సమయంలో కేసీఆర్ హాలియా సభలో ఏపీ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ దాదాగిరి చేస్తుందన్న కీలక వ్యాఖ్య కేసీఆర్ నోటి నుంచి వచ్చింది. ఓపక్క సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా సీఎం కేసీఆర్ ఆవేశానికి అంతకు మించిన ఆగ్రహానికి గురైతే.. తాము మాత్రం ఏమైనా తక్కువ తిన్నామా? అన్న చందంగా నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ ను ఉద్దేశించి.. ఆయన మాటలకు కౌంటర్ ఇచ్చేశారు.

కృష్ణా జలాల వివాదం ఎవరు సృష్టించారో అందరికీ తెలుసన్న సజ్జల..  ‘‘దాదాగిరి ఎవరు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలను సైతం తెలంగాణ పట్టించుకోవడం లేదు.  జల విద్యుత్‌ ఉత్పత్తి పేరుతో 30 టీఎంసీల నీటిని తెలంగాణ ప్రభుత్వం.. సముద్రం పాలు చేసింది. ఎగువ ప్రాంతంలో ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం జల జగడానికి దిగింది. ఆంధ్రప్రదేశ్‌ వాటా నీటిని కాపాడేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు’’ అని పేర్కొన్నారు.

ఉద్రిక్తతను పెంచేలా సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు ఉన్నప్పుడు.. దాన్ని మరింత పెంచేలా వ్యాఖ్యలు చేయటం కంటే.. అధికారిక సమాచారాన్ని వెల్లడించి.. తప్పు ఎవరు చేస్తున్నారు? దాదాగిరి ఎవరిది? అన్న ప్రశ్నల్ని సంయమనంతో అడిగితే బాగుండేదన్న వాదన వినిపిస్తోంది. అందుకు భిన్నంగా తొందరపాటుతో వ్యవహరిస్తే రెండురాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు పెరగటం ఖాయం. భావోద్వేగానికి గురి చేయాలన్న కేసీఆర్ ప్లాన్ ను సక్సెస్ చేయాలన్నట్లుగా సజ్జల రియాక్షన్ ఉందన్న విమర్శ వినిపిస్తోంది.
Tags:    

Similar News