స‌ల‌హాదారుతో అస‌లు క‌ష్టాలు!

Update: 2022-02-05 00:30 GMT
ఏదైనా స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు... ప‌ద‌వుల్లో ఉన్న వారు ప్ర‌తిష్ట‌ల‌కు పోవ‌డం స‌హ‌జం. కానీ, స‌ల‌హాదారులుగా ఉన్న‌వారు కూడా ఆవేశాల‌కు పోతే.. రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేస్తే.. స‌మ‌స్య స‌ర్దుమ‌ణ‌గ‌క‌పోగా.. మ‌రింత చేజారుతుంది. ఇప్పుడు ఏపీలో ప్ర‌భుత్వానికి, ఉద్యోగుల‌కు మ‌ధ్య త‌లెత్తిన వివాదంలో స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి చేస్తున్న వ్యాఖ్య‌లు.. స‌మ‌స్య‌ను నానాటికీ మ‌రింత పెంచుతున్నాయ‌ని.. ఒక‌వైపు ఉద్యోగులు.. చెబుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఇదే విష‌యాన్ని వైసీపీ సీనియ‌ర్  నేత‌లు కూడా అంటున్నారు. ``ఆయ‌న వ‌ల్ల మంట‌లు మ‌రింత రేగుతున్నాయి`` అంటూ.. సీనియ‌ర్ నేత‌లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో స‌జ్జ‌ల‌ను క‌ట్ట‌డి చేయాల‌ని.. ప్ర‌భుత్వం నియ‌మించిన క‌మిటీలో ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టాల‌ని అంటున్నారు. దీనికి కార‌ణం.. తాజాగా మ‌రోసారి స‌జ్జ‌ల ఉద్యోగ సంఘాల‌పై విరుచుకుప‌డ్డ‌మే!. ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో   సజ్జల  ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులను రోజూ చర్చలకు ఆహ్వానించాల్సిన అవసరం లేదన్నారు. వారి తదుపరి కార్యాచరణ ఏంటో తెలియదన్న సజ్జల.. చర్చలకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉందన్నారు. చర్చలు జరిపితేనే సమస్యలు పరిష్కారమవుతా యని తెలిపారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమేనని.. అలాంటప్పుడు వారు ఎవరిపై ఒత్తిడి తెస్తారని రెచ్చ‌గొట్టేలా వ్యాఖ్య‌లు చేశారు.

ఉద్యోగుల ఉద్యమంలో పార్టీలు చేరితే పరిస్థితి చేయి దాటుతుందని ప‌రోక్షంగా ఆయ‌న హెచ్చ‌రించారు. ఉద్యోగులకు ఇచ్చిన అవకాశాలను వదులుకుంటున్నారని అన్నారు. ``ఉద్యోగుల ఉద్యమంలో పార్టీలు కూడా చేరాయి. ఉద్యోగుల ఉద్యమానికి పార్టీలను స్వాగతిస్తామంటున్నారు. పార్టీలు చేరితే ఉద్యోగుల ప్రయోజనాలు దెబ్బతింటాయి. ఉద్యోగులే బదిలీలు కోరుతున్నా రు.. అలాంటప్పుడు ప్రభుత్వం బదిలీల ప్రక్రియ ఎందుకు ఆపుతుంది. సమ్మె నోటీసు ఇచ్చారని ప్రభుత్వం బదిలీలు ఆపుతుందా? సమ్మె నోటీసు ఇచ్చామని.. ఉద్యోగులపై చర్యలు తీసుకోవద్దంటే ఎలా? అత్యవసర సేవలు ఆపితే పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది`` అని వ్యాఖ్యానించారు.

ఒక్క ఈరోజే కాదు.. గ‌డిచిన రెండు రోజులుగా కూడా స‌జ్జ‌ల ఇలాంటి కామెంట్లే చేస్తున్నారు. బలప్రదర్శన చేయడం ద్వారా సమస్య జఠిలం అవుతుందని సజ్జల వ్యాఖ్యనించారు. సమ్మె వల్ల ఏమైనా ఇబ్బందులు తలెత్తితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.  ప్రదర్శనలు, సమ్మెల వల్ల ఏం సాధిస్తారో అర్థం కావటం లేదన్నారు. దీంతో ఉద్యోగులు మ‌రింత‌గా ఆవేద‌న చెందుతున్నారు. ఇదే అంశంపై వైసీపీలోనూ సీనియ‌ర్ చ‌ర్చ‌లు చేస్తున్నారు. స‌ల‌హాదారు అంటే.. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేలా వ్య‌వ‌హ‌రించాల‌ని.. కానీ.. ముఖ్య‌మంత్రి మెప్పుకోసం.. స‌జ్జ‌ల ప‌నిచేస్తున్న‌ట్టుగా ఉంద‌ని.. నేత‌ల మ‌ధ్య గుస‌గుస వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇప్ప‌టికైనా.. సీఎం జోక్యం చేసుకోవాల‌ని వారు కోరుతున్నారు. ప‌రిస్థితి చేయిదాటితో చెడ్డ పేరు.. ప్ర‌భుత్వానికే వ‌స్తుంద‌ని వారు అంటున్నారు.
Tags:    

Similar News