ఆహా ! ఏం చెప్పావ‌య్యా స‌జ్జ‌ల...

Update: 2022-07-16 15:30 GMT
రోడ్లన్నీ బాగు చేస్తాం : భారీ వర్షాలు కురుస్తున్నాయి. అందుకే రోడ్లు పాడవుతున్నాయి. అన్నింటినీ బాగు చేస్తాం. విపక్ష నేత చంద్రబాబు హయాంలో రోడ్ల నిర్మాణం లేదు. కానీ వర్షాలు లేకపోవడం వల్ల వాటి దుస్థితి తెలియలేదు. ఈ ప్రభుత్వం ఎప్పుడైనా, ఏమైనా జరిగినప్పుడు అక్కడికి పోయి నానా హడావిడి చేసి, ప్రచారం చేసుకోదు.

ఎవ్వరి బాధ్యతలు వారు నిర్వర్తిస్తారు. విప‌క్ష నేత చంద్రబాబు మాదిరిగా తుఫానును ఆపుతామని, వరదలను, తుఫానులను దారి మళ్లిస్తామనే పనికిమాలిన మాటలు జగన్  మాట్లాడరు. వీలైనంత వరకు ప్రజల ఇబ్బంది తొలగించే ప్రయత్నం చేస్తాం. వేగంగా సాధారణ పరిస్థితులు నెలకొనేలా కృషి చేస్తున్నాం.
 
- స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి - ప్ర‌భుత్వ స‌ల‌హాదారు

రాష్ట్రంలో రోడ్ల దుఃస్థితి, ప్ర‌యాణికుల దుర‌వ‌స్థ‌ల‌పై దృష్టి సారించాల్సిన పెద్ద‌లు పై విధంగా మాట్లాడ‌డంపై విమ‌ర్శ‌లు రేగుతున్నాయి. ఇప్ప‌టికే కొన్ని చోట్ల ప్యాచ్ వ‌ర్క్ లు మాత్ర‌మే చేసి వ‌దిలేశార‌ని, అవి కూడా స‌గం స‌గం ప‌నులే అని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్న నేప‌థ్యాన గౌర‌వ స‌జ్జ‌ల రామకృష్ణా రెడ్డి (మాజీ జ‌ర్న‌లిస్టు, ఒక‌నాటి సాక్షి ఎడిటోరియ‌ల్ డైరెక్ట‌ర్) ఈ విధంగా మాట్లాడ‌డం త‌గునా అన్న విధంగా ఓ వాద‌న వినిపిస్తోంది.

ఇప్ప‌టికే గుడ్ మార్నింగ్ సీఎం అంటూ జ‌న‌సేన త‌న‌దైన వాద‌నతో డిజిట‌ల్ వార్ చేస్తోంది. అస్త‌వ్య‌స్తంగా ఉన్న రోడ్ల దుఃస్థితిపై ఎక్క‌డిక్క‌డ అవే బుర‌ద‌గుంట‌ల్లో కూర్చొని మ‌రీ నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తోంది. వినూత్న‌ రీతిలో నిర‌స‌న‌లు చెబుతూ స‌మస్య తీవ్ర‌త‌ను క‌ళ్ల‌కు క‌డుతోంది.

చెరువుల‌ను త‌ల‌పిస్తున్న రోడ్ల‌ను చూపి అందులో విత్త‌నాలు జ‌ల్లుతోంది. కొన్ని చోట్ల నాట్లు నాటుతోంది. వ‌ల‌లు విసిరి వ్యంగ్య ధోర‌ణిలో బ‌హుశా !  ఇక్క‌డ చేప‌లు ప‌డ‌తాయేమో అంటూ గ్రామీణ ర‌హ‌దారుల ద‌య‌నీయ‌త‌ను చాటుతోంది. ఈ విధంగా ఎక్క‌డికక్క‌డ త‌న గోడు వినిపిస్తున్నా అధికార పార్టీ నుంచి వ‌స్తున్న స్పంద‌న అస్స‌లు బాలేదు అన్న విమ‌ర్శ ఒక‌టి విప‌క్షం చేస్తోంది. ఇన్ని జ‌రుగుతున్నా కూడా ర‌హ‌దారుల మ‌ర‌మ్మతుల‌కు జూన్ చివ‌ర్లోనో జూలై మొద‌టి వారంలోనో పూనుకోవ‌డం అన్న‌ది నిజంగానే త‌మ‌కు సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గురిచేస్తోంద‌ని విప‌క్షం అంటోంది. ఇప్పుడు ప్ర‌భుత్వ స‌ల‌హాదారు చెబుతున్న మాట‌లు ప్ర‌కారం వాన‌లు రావ‌డం వ‌ల్లే రోడ్లు పాడ‌యిపోతున్నాయి అని చెప్ప‌డం మ‌రిన్ని విమ‌ర్శల‌కు తావిస్తున్నాయి.
Tags:    

Similar News