‘సాక్షి’తో రియోలో భారత్ కు పతకం

Update: 2016-08-18 05:20 GMT
లండన్ ఒలింపిక్స్ కంటే మెరుగైన ఆటతీరుతో పతకాలు సాధిస్తారన్న ఆంచనాలు రియో ఒలింపిక్స్ ముందు విపరీతంగా వినిపించాయి. ఈసారి పదికి తగ్గకుండా మన ఆటగాళ్లు పతకాలు సాధిస్తారంటూ పలువురు విశ్లేషించారు. దీనికి భిన్నంగా ఒలింపిక్స్ మొదలై అన్ని పోటీలు ముగింపునకు దగ్గర పడుతున్నా.. ఒక్కటంటే ఒక్క పతకం కూడా సాధించకపోవటం భారత క్రీడాభిమానుల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది.

ఇలాంటి నిరాశను పక్కన పెడుతూ కొత్త ఆశ ఒకటి ‘సాక్షి’ రూపంలో అవతరించింది. కోట్లాది భారతీయులు ఎప్పుడా.. మరెప్పుడా అని ఎదురుచూస్తున్న వేళ.. వారి ఆశలకు.. ఆకాంక్షలకు ప్రతిరూపంగా సాక్షి మాలిక్ రజత పతకాన్ని సొంతం చేసుకుంది. రెజ్లింగ్ లో ప్రత్యర్థిని ఢీ కొన్న సాక్షి విజయం సాధించటం ద్వారా రియో ఒలింపిక్స్ లో భారత్ బోణీ కొట్టినట్లైంది. ఫ్రీ స్టయిల్ రెజ్లింగ్ లో 58 కేజీల విభాగంలో కిర్గిజిస్తాన్ కు చెందిన తినిబెకోవాతో తలపడి.. కాంస్యం సొంతం చేసుకుంది. బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ మ్యాచ్ లో ఆమె విజయం సాధించింది. వాస్తవానికి క్వార్టర్ ఫైనల్లో సాక్షి మాలిక్ రష్యా క్రీడాకారిణి చేతిలో ఓడిపోయింది. అయితే.. సాక్షిపై నెగ్గిన రష్యా రెజ్లెర్ ఫైనల్ కు చేరుకోవటంతో సాక్షికి ‘‘రెప్ చేజ్’’లో పోటీ పడే అవకాశం లభించింది.

తనకు దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సాక్షి.. కిర్గిజిస్తాన్  క్రీడాకారిణిపై విజయం సాధించటంతో భారత్ కు రియో ఒలింపిక్స్ లో తొలి పతకాన్ని సొంతం చేసుకున్నట్లైంది. ఇప్పటివరకూ ఒక్కటంటే ఒక్క పతకం కూడా సాధించలేదన్న సగటు భారతీయుడి ఆవేదన కొంతమేర తీరిందని చెప్పాలి.
Tags:    

Similar News