చిరంజీవి సినిమా విలన్‌ పై బెట్టింగ్ ఆరోపణలు

Update: 2018-06-01 16:33 GMT
   
క్రికెట్‌ కి బెట్టింగుకు ఉన్న ఆ లింకు ఎక్కడా తెగడం లేదు. అందులోనూ ఐపీఎల్ అంటే బెట్టింగు లేకుండా ఆ లీగ్ సాగదన్నట్లుగా మారింది. మొన్న ముగిసిన ఐపీఎల్ 11వ సీజన్‌లో మాత్రం ఎక్కడా ఇలాంటి ఆరోపణలేవీ లేకుండానే సజావుగానే ముగిసింది. కానీ.. అంతలోనే  ఐపీఎల్‌ లో బెట్టింగు జరిగిందంటూ ప్రచారం జరుగుతోంది.  బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్‌ కు బుకీలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు రావడంతో మహారాష్ట్రలోని థానె క్రైం బ్రాంచ్ పోలీసులు ఆయనకు శుక్రవారం సమన్లు జారీ చేయడంతో మొన్నటి ఐపీఎల్ మ్యాచులపై అనుమానాలు మొదలయ్యాయి.
    
ఐపీఎల్ బెట్టింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సోనూ జలన్‌ను రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్‌ చేశారు. దావూద్ ఇబ్రహీంకు జలన్ కుడి భుజం. పోలీసుల విచారణలో భాగంగా సోనూ జలన్‌... అర్బాజ్ ఖాన్ పేరు చెప్పడంతో శనివారం విచారణకు హాజరుకావాల్సిందిగా పోలీసులు ఆయనకి సమన్లు జారీ చేశారు. ఐపీఎల్ 11వ సీజన్‌ లో టాప్‌ బుకీల ద్వారా అర్బాజ్‌ ఖాన్ బెట్టింగ్‌ కు పాల్పడినట్లు తెలుస్తోంది. అర్భాజ్ మాత్రం దీనిపై ఇంతవరకు పెదవి విప్పలేదు.
    
పోలీసుల విచారణలో సోనూ జలన్ ఇటీవల ముగిసిన ఐపీఎల్ 11వ సీజన్‌లో అర్బాజ్ ఖాన్ బుకీలతో కలిసి బెట్టింగ్‌కు పాల్పడినట్లు చెప్పాడట. ముంబైకి చెందిన జలన్ ఓ ఆన్‌లైన్‌లో పోర్టల్‌ ను నిర్వహిస్తూ పనిలోపనిగా దావూద్ తరఫున దేశంలో భారీ ఎత్తున బెట్టింగ్ దందా నడిపిస్తున్నాడని పోలీసులు చెప్తున్నారు. కాగా... అర్భాజ్ ఖాన్ నటుడిగా సుపరిచితుడే. 'దబాంగ్' - 'దబాంగ్‌ 2' చిత్రాల్లో అర్బాజ్‌ ఖాన్ విలన్‌ పాత్రలు పోషించారు. అంతేకాకదు సల్మాన్‌ నటించిన పలు చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి నటించిన 'జై చిరంజీవ' చిత్రంలో విలన్ ఈ అర్బాజ్‌ ఖానే.
Tags:    

Similar News