ఆర్మీఛీప్‌ ను అంత మాట అనేశాడే!

Update: 2017-06-12 06:12 GMT
కాంగ్రెస్ పార్టీ ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల్లో చిక్కుకుంది. నోరు జారే నేత‌ల‌తో త‌ర‌చూ ఇబ్బందులు ప‌డుతున్న కాంగ్రెస్ పార్టీకి.. ఈసారి మ‌రిన్ని చిక్కులు ఎదుర‌య్యే ప‌రిస్థితిని తీసుకొచ్చారు ఆ పార్టీకి చెందిన నేత ఒక‌రు. జాతీయ‌వాదం విష‌యంలో కాంగ్రెస్ పార్టీ కావొచ్చు.. ఆపార్టీకి చెందిన నేత‌లు వెనుక‌బ‌డి ఉన్నార‌న్న ఒక అప‌ప్ర‌ద దేశ ప్ర‌జ‌ల్లో ఎక్కువ ఉంద‌న్న మాట వినిపిస్తూ ఉంటుంది. అందుకు బ‌లం చేకూరేలా తాజా వ్యాఖ్య‌లు ఉండ‌టం కాంగ్రెస్‌ ను ఇబ్బంది పెట్టేదే.

ఢిల్లీ మాజీ ముఖ్య‌మంత్రి షీలా దీక్షిత్ కుమారుడు.. కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ తాజాగా నోరు జారేశారు. రాజ‌కీయ నాయ‌కులు అస్స‌లు ట‌చ్ చేయ‌ని ఆర్మీ చీఫ్‌ పై ఆయ‌న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఆ వ్యాఖ్య‌ల్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. మాఫియాలా హెచ్చ‌రిక‌లు చేసే పాక్ సైన్యానికి మ‌న ఆర్మీకి తేడా ఉంద‌ని.. మ‌న ఆర్మీ చీఫ్ (రావ‌త్‌) వీధి రౌడీలా మాట్లాడుతుంటే విన‌టానికి ఇబ్బందిక‌రంగా ఉందంటూ వ్యాఖ్యానించారు. స‌రిహ‌ద్దుల్లో పాక్ చేస్తున్న దారుణాల‌పై ఆర్మీచీఫ్ స్పందించిన నేప‌థ్యంలో.. ఆ వ్యాఖ్య‌ల్ని ప్ర‌స్తావిస్తూ సందీప్ మాట‌లు ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతున్నాయి. సందీప్ వ్యాఖ్య‌ల‌పై కేంద్ర హోంశాఖ స‌హాయ‌మంత్రి కిర‌ణ్ రిజుజు మండి ప‌డ్డారు. ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేయ‌టాన్ని త‌ప్పు ప‌ట్టారు. ఆయ‌న‌కెంత ధైర్య‌మ‌ని మండిప‌డ్డారు.

ఇలాంటి వ్యాఖ్య‌లు చేసిన సందీప్ ను పార్టీ నుంచి తొల‌గించాల‌ని.. అత‌డిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీని డిమాండ్ చేశారు బీజేపీ అధికార ప్ర‌తినిధి సంబిత్ పాత్రా. ఈ వివాదంపై కాంగ్రెస్ స్పందించింది. సందీప్ వ్యాఖ్య‌లు దుర‌దృష్ట‌క‌రంగా అభివ‌ర్ణించింది. ఇదిలా ఉంటే.. తాను చేసిన వ్యాఖ్య‌లు పెను దుమారం రేపుతున్న నేప‌థ్యంలో ఆయ‌న త‌న వ్యాఖ్య‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. నోటికి వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడేసి.. ఆపై సారీలు చెప్పేస్తున్న ఈ నేత‌లు.. మాట్లాడేట‌ప్పుడు కాస్త జాగ్ర‌త్త‌గా ఉంటే స‌రిపోతుంది క‌దా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News