తెలంగాణ‌లో టీడీపీ కనుమ‌రుగు!

Update: 2019-01-09 06:13 GMT
తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ చ‌రిత్ర ఒక‌ప్పుడు ఘ‌నం. ఆంధ్ర ప్రాంతంతో పోలిస్తే ఇక్క‌డే పార్టీ ఎక్కువ బ‌లంగా ఉండేది. ఈ ప్రాంతంలోనే ఎక్కువ సీట్లు గెల్చుకునేది. అలాంటి టీడీపీ ఇప్పుడు తెలంగాణ‌లో గ‌తంగానే మిగిలిపోతోంది. పూర్తిగా క‌నుమ‌రుగ‌వుతోంది.

తెలంగాణ ఆవిర్భావం త‌ర్వాత చంద్ర‌బాబు నాయుడు త‌న దృష్టిని పూర్తిగా ఏపీపైనే కేంద్రీక‌రించారు. అయిన‌ప్ప‌టికీ 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ ఇక్క‌డ గౌర‌వ‌నీయ సంఖ్య‌లో స్థానాలు ద‌క్కించుకుంది. ఇటీవ‌ల కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని మ‌ళ్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో దిగింది టీడీపీ. అయితే - ఘోర ప‌రాభ‌వం ఎదురైంది. పార్టీ నుంచి ఇద్ద‌రు మాత్ర‌మే ఎమ్మెల్యేలుగా ఎన్నిక‌య్యారు. అది కూడా ఒక్క ఖ‌మ్మం జిల్లా నుంచే.

ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో గెల్చిన ఆ ఇద్ద‌రు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ప్ర‌స్తుతం టీఆర్ ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. టీడీపీ టికెట్ పై గెల్చిన స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య‌ - అశ్వ‌రావుపేట ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వ‌ర‌రావు మంగ‌ళ‌వారం టీఆర్ ఎస్ సీనియ‌ర్ నేత - మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుతో గంట‌కుపైగా భేటీ అయ్యారు. పార్టీ మార‌డంపై చ‌ర్చించారు.

త‌మ‌తో చేతులు క‌లిపితే మంచి ఆద‌ర‌ణ ఉంటుంద‌ని సండ్ర‌ - మెచ్చల‌కు టీఆర్ ఎస్ అగ్ర నాయ‌క‌త్వం నుంచి హామీ ల‌భించిన‌ట్లు తెలుస్తోంది. వారిద్ద‌రు సంక్రాంతికి ముందే పార్టీ మారే అవ‌కాశ‌ముంది. అదే జ‌రిగితే తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ ప్రాతినిధ్య‌మే ఉండ‌దు. 1983లో టీడీపీ ఆవిర్భ‌వించిన త‌ర్వాత అసెంబ్లీలో ఆ పార్టీ ఎమ్మెల్యే ఒక్క‌రు కూడా ఉండ‌క‌పోవ‌డం అదే తొలిసారి అవుతుంది. అసెంబ్లీలో టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 93కు పెరుగుతుంది. ఖ‌మ్మం జిల్లాలోని రామ‌గుండం నియోజ‌క‌వ‌ర్గం నుంచి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా విజ‌యం సాధించిన కోరుకంటి చంద‌ర్ ఇప్ప‌టికే టీఆర్ ఎస్ లో చేరిన సంగ‌తి గ‌మ‌నార్హం.

ఎన్నిక‌ల్లో ప‌రాభ‌వంతో ఇప్ప‌టికే కుదేలైన తెలంగాణ టీడీపీ శ్రేణుల‌ను సండ్ర‌, మెచ్చ పార్టీ మార‌డం మ‌రింత కుంగ‌దీస్తుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇక‌పై వారు టీడీపీ జెండాలు మోయ‌డం మానేస్తార‌ని, వారు కూడా టీఆర్ ఎస్ లోకి లేదా కాంగ్రెస్ లోకి వెళ్ల‌క త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితులు ఎదుర‌వుతాయ‌ని సూచిస్తున్నారు. ఏది ఏమైనా ఒక‌ప్పుడు తెలంగాన గ‌డ్డ‌పై ప్ర‌భంజ‌నం సృష్టించిన టీడీపీ ఇప్పుడు క‌నుమ‌రుగైపోయిన‌ట్లేన‌ని వారు పేర్కొన్నారు.


Full View
Tags:    

Similar News