సానియా మీర్జా అద్భుతం చేసింది

Update: 2020-01-18 16:44 GMT
సానియా మీర్జా ఇప్పుడు టెన్నిస్ వర్గాల్లో హాట్ టాపిక్‌ అవుతోంది. 33 ఏళ్ల వయసులో.. అందులోనూ ఒక బిడ్డకు తల్లి అయ్యాక ఆమె టెన్నిస్‌లోకి పునరాగమనం చేసి అద్భుత ప్రదర్శనతో తన పునరాగమనాన్ని ఘనంగా చాటింది. పెళ్లయితే.. పిల్లల్ని కంటే ఆటకు దూరం కావాల్సిన పని లేదని,  సంకల్ప బలం ఉంటే ఏ వయసులో - ఎలాంటి స్థితిలో అయినా అద్భుతాలు చేయొచ్చని ఆమె రుజువు చేస్తోంది.

రెండేళ్ల కిందట గర్భవతి కావడంతో సానియా టెన్నిస్‌కు టాటా చెప్పేసింది. ప్రసవం అయ్యాక బాగా బరువు పెరిగిన ఆమె.. 32 ఏళ్ల వయసులో మళ్లీ ఆట వైపు అడుగులు వేస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. ఇక టెన్నిస్ వదిలేసి వ్యక్తిగత జీవితానికి పరిమితం అవుతుందని అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా తాను ఆటలోకి పునరాగమనం చేయబోతున్నట్లు గత ఏడాది ప్రకటించి ఆశ్చర్యపరిచింది. చెప్పిన వెంటనే ఆమె జిమ్‌లో కసరత్తులు మొదలుపెట్టింది.

కొన్ని నెలల వ్యవధిలో 20 కిలోలకు పైగా బరువు తగ్గి ఫిట్‌ గా తయారైన ఆమె.. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌ ను టార్గెట్‌ గా పెట్టుకుంది. దీనికి సన్నాహకంగా జరిగే హోబర్ట్ ఇంటర్నేషనల్ టోర్నీలో ఉక్రెయిన్ అమ్మాయి నదియా కిచెనోక్‌ తో కలిసి మహిళల డబుల్స్ బరిలోకి దిగింది. పెద్దగా అంచనాల్లేకుండా టోర్నీని ఆరంభించిన ఈ జోడీ.. అద్భుత ప్రదర్శనతో టైటిల్ గెలవడం విశేషం. ఫైనల్లో సానియా-నదియా జోడీ 6-4 - 6-4తో షాయ్ పెంగ్-షాయ్ జాంగ్ (చైనా) జోడీని ఓడించింది.

   

Tags:    

Similar News