రెడీమేడ్ సంక్రాంతి.. గొబ్బెమ్మల నుంచి ముగ్గులదాకా..!

Update: 2022-01-11 01:30 GMT
సంక్రాంతి అనగానే టఫీమని గుర్తుకువచ్చేది రంగురంగుల ముగ్గులు. ఆ రంగవల్లుల మధ్య ఉండే గొబ్బెమ్మలు. ఇక నెల రోజుల ముందు నుంచే ప్రత్యేకమైన ముగ్గులను ఇళ్ల ముందు వేస్తారు. పండుగ రోజు దగ్గరపడేకొద్దీ... మహిళలు ఏ ముగ్గు వేయాలా? అని తెగ హైరానా పడుతుంటారు. ఈ సంక్రాంతి అచ్చమైన పల్లె పండుగ. ఇది రైతు పండుగ. అన్నదాతలకు పంట చేతికొచ్చి... ఇంట్లో సిరిసంపదలు కొలువు ఉండే పండుగ. ఈ పండుగ మూడు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. మహిళలు వేకువజామునే నిద్రలేస్తారు. ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకుంటారు. ముంగిట్లో పేడ నీళ్లు చల్లి... పెద్ద పెద్ద రథం ముగ్గులు పరుస్తారు. చూడచక్కనైన రంగులతో తీర్చిదిద్దుతారు. ఆ ముగ్గుల మధ్యలో నవధాన్యాలు, గొబ్బెమ్మలు, రేగుపండ్లను పెడతారు. అయితే ఇదంతా అప్పటి ముచ్చట. మారిన ఈ కాలంలో పండుగ జరుపుకునే విధానం కూడా మారింది.

సంక్రాంతి పండుగకు నెల ముందు నుంచే మహిళలు తగు ఏర్పాట్లు చేసుకుంటారు తెలుగు ఆడపడుచులు. అందమైన, చూడసక్కనైన ముగ్గులను ఎంపిక చేసుకుంటారు. ఇక తళతళలాడే ముగ్గును సేకరిస్తారు. వివిధ రకాల పూలు, ఆకులను ఎండబెట్టి రంగులను తయారుచేసుకునేవారు. అప్పట్లో అంతా కూడా సహజసిద్ధంగా ఉండేది. కానీ మారిన మన జీవన విధానంతో పాటు పండుగ జరుపుకోవడంలోనూ మార్పులు వచ్చాయి. బతుకుదెరువు కోసం పట్టణాలకు తరలివెళ్లిన వాళ్లు పండుగకు పల్లెకు వస్తారు. అలా వచ్చేటప్పుడే రెడీమేడ్ గా అన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఇంటి ముందు చల్లే పేడనీళ్లకు బదులు ఆ రంగులో ఉండే పౌడర్, రెడీమేడ్ గొబ్బెమ్మలు, ఇసుక కలిపిన రెడీమేడ్ రంగులు అన్నీ కూాడా మార్కెట్ లో దొరుకుతున్నాయి.

ఇంటిముందు గొబ్బిళ్లు పెట్టిన తర్వాత అమ్మలక్కలంతా పాడే గొబ్బియళ్లో.. గొబ్బియళ్లో... అని పాడేవారే కనుమరుగయ్యేవారు. ఆంధ్రప్రదేశ్ లోని ఊళ్లలో ఉండేవారంతా తగ్గిపోయారు. ఇక ఉన్నకొంత మంది కూడా పాడడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఏదో నామమాత్రంగా కానిచ్చేస్తున్నారు. రంగును నీళ్లలో కలిపి ఇంటి ముందు చల్లుతున్నారు. ఆ రెడీమేడ్ వస్తువులతో అలంకరిస్తున్నారు. ఇంత పెద్ద పండుగను ఈ రెడీమేడ్ వస్తువులతో జరుపుకోవడానికి బిజీ లైఫ్ కూడా ఓ కారణం.

విద్యాఉపాధి అవకాశాల దృష్ట్యా జనం పల్లెలు విడిచి.. పట్టణాల్లో సెటిల్ అవుతున్నారు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఏదో పండుగ కోసం అలా ఓ రెండు మూడు రోజులు ఊరికి వెళ్తున్నారు. ఇక అప్పటికప్పుడు సహజసిద్ధమైన వస్తువులు లభించవు కదా. అందుకే ముందు జాగ్రత్తతోనే మార్కెట్ లోకి వచ్చిన రెడీమేడ్ సరుగును కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇదిలా ఉంటే పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ముగ్గుల పోటీలు మాత్రం బాగా జరుగుతున్నాయి. పిల్లా పెద్దా కూడా ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో సంక్రాంతికి కొన్ని ప్రత్యేకమైన పోటీలు గట్రా జరుపుకుంటారు.
Tags:    

Similar News