దోశ‌ల రాజు జైలుకు ఎందుకు వెళ్లాల్సి వ‌చ్చింది?

Update: 2019-07-04 05:07 GMT
మీ జాత‌కం ప్రకారం ఆ ఒక్క ప‌ని చేయండి చాలు.. మీ సుడి మొత్తం తిరిగిపోతుందంటూ చెప్పే మాట‌లు ఏ స్థానంలో ఉన్నోడినైనా ఇట్టే అక‌ర్షిస్తాయి. రాజుకు సైతం కొత్త ఆశ‌లు పుట్టించే న‌మ్మ‌కం.. గుడ్డిగా న‌మ్మేస్తే ఎంత దారుణ ప‌రిస్థితులు ఎదుర‌వుతాయ‌ని చెప్ప‌టానికి తాజా ఉదంతం ఒక చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణ‌.

ఉల్లిపాయ‌లు అమ్ముకునే ఫ్యామిలీ నుంచి ఎదిగిన ఒక వ్య‌క్తి ప్ర‌ముఖుడిగా మారిన త‌ర్వాత తాను న‌మ్ముకున్న న‌మ్మ‌కాల్ని త‌న‌ని ఎంత‌గా దిగ‌జార్చాయన్న విష‌యం క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా చూపుతుంది శ‌ర‌వ‌ణ భ‌వ‌న్ య‌జ‌మాని పి.రాజ‌గోపాల్ వ్య‌వ‌హారం.

ద‌క్షిణాది వారు ఎక్క‌డున్నా.. ఆ మాట‌కు వ‌స్తే ఉత్త‌రాది వారి మ‌నసును దోచుకున్న హోట‌ల్ గా శ‌ర‌వ‌ణ భ‌వ‌న్ ను చెప్పాలి. చెన్నై మొద‌లు లండ‌న్.. న్యూయార్క్.. సింగ‌పూర్..సిడ్నీ.. స్టాక్ హోం ఇలా ఏ ప్ర‌పంచ స్థాయి న‌గ‌రంలో అయినా క‌నిపించే ఇండియ‌న్ రెస్టారెంట్ గా శ‌ర‌వ‌ణ భ‌వ‌న్ క‌నిపిస్తుంది. ఉల్లిపాయ‌లు అమ్ముకునే కుటుంబంలో పుట్టి 1981లో పొట్ట చేత ప‌ట్టుకొని చెన్నైలో కిరాణా వ్యాపారాన్ని షురూ చేశారు రాజ‌గోపాల్. త‌న స్థాయికి మించిందైనా.. త‌న మీద త‌న‌కున్న న‌మ్మ‌కంతో శ‌ర‌వ‌ణ భ‌వ‌న్ ను ఏర్పాటు చేశాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ దేశంలోనే కాదు.. విదేశాల్లో 80 శాఖ‌ల్ని ఏర్పాటు చేసి దోశ‌ల రాజుగా పేరు గ‌డించాడు.

ఇంత ఎదిగినా ఇంకా మ‌న‌సులో మ‌రింత ఎద‌గాల‌న్న అత్యాశ‌.. అందుకు అడ్డ‌దారి తొక్కిన వైనం ఆయ‌న్ను అధఃపాతాళానికి ప‌డేలా చేసింది. త‌న ద‌గ్గ‌ర ప‌ని చేసే ఒక ఉద్యోగి కుమార్తెను మూడో భార్య‌గా చేసుకుంటే త‌న‌కు బాగా క‌లిసి వ‌స్తుంద‌న్న ఒక జ్యోతిష్యుడి మాట‌ను న‌మ్మాడు రాజ‌గోపాల్. అర‌వై ఏళ్లు దాటిన వేళ‌.. అప్ప‌టికే పెళ్లి అయిన ఒక మ‌హిళ మీద క‌న్నేసి ఆమెను సొంతం చేసుకోవాల‌నుకున్నాడు. అయినా సాధ్యం కాక‌పోవ‌టంతో ఏకంగా ఆమె భ‌ర్త‌ను చంపేయ‌టం ద్వారా ఆమెను త‌న భార్య‌గా చేసుకోవాల‌ని దుర్మార్గ‌మైన ప్లాన్ వేసి అడ్డంగా బుక్ అయ్యాడు.

హ‌త్య కేసులో కింది కోర్టు ప‌దేళ్లు శిక్ష వేస్తే.. మ‌రింత త‌గ్గుతుంద‌ని సుప్రీంలో స‌వాల్ చేస్తే.. దాన్ని కాస్తా యావ‌జ్జీవ కారాగార శిక్ష వేశారు. దీంతో.. అంత పెద్ద దోశెల రాజు ఇప్పుడు జైలుజీవితానికి రెఢీ అవుతున్నారు. ఆదివారం నాటికి ఆయ‌న జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. న‌మ్మ‌కాల్ని న‌మ్మొద్ద‌ని చెప్ప‌ట్లేదు. కానీ.. ఆ మ‌త్తులో ప‌డ‌కుండా కాస్తంత తెలివిగా ఉంటే.. అన‌వ‌స‌ర‌మైన ఉచ్చులో ప‌డ‌కుండా ఉండొచ్చ‌నటానికి శ‌ర‌వ‌ణ రాజ‌గోపాల్ ఉదంతం ఒక చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణ‌.


Tags:    

Similar News