సెల్వం తన‌కో లెక్కా అంటున్న చిన్న‌మ్మ‌

Update: 2017-02-13 15:28 GMT
త‌మిళనాడులో అధికార అన్నాడీఎంకే నెల‌కొన్న ప‌రిణామాల్లో భాగంగా చిన్న‌మ్మ శ‌శిక‌ళ త‌న స్వ‌రాన్ని మ‌రింత పెంచారు. ప్ర‌త్య‌ర్థి ప‌న్నీర్‌ సెల్వంపై మాట‌ల తూటాలు పేల్చారు. జ‌య‌ల‌లిత‌తో 33 ఏళ్లు క‌లిసున్న స‌మ‌యంలో ఇలాంటి వెయ్యిమంది ప‌న్నీర్‌ సెల్వాల‌ను తాను చూశాన‌ని, తానెవ‌రికీ భ‌య‌ప‌డ‌బోన‌ని ఆమె స్ప‌ష్టంచేశారు. జ‌య‌ల‌లిత చ‌నిపోయిన త‌ర్వాత త‌న‌నే సీఎం పీఠం ఎక్కాల్సిందిగా ప‌న్నీరుసెల్వం కోరార‌ని, కానీ అప్పుడు బాధ‌లో ఉన్న తాను తిర‌స్క‌రించాన‌ని ఆమె చెప్పారు. మీ అంద‌రికీ ఈ నిజం తెలియాల‌ని ఎమ్మెల్యేల‌ను ఉద్దేశించి శ‌శిక‌ళ అన్నారు.

కాగా, త‌న‌ను ప్ర‌భుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గ‌వ‌ర్న‌ర్‌ కు కూడా శ‌శిక‌ళ‌ ఒక రోజు గ‌డువు విధించారు. న‌మ్మ‌క‌ద్రోహి ప‌న్నీర్‌ సెల్వం అస‌లు రంగులు ఇప్పుడు బ‌య‌ట‌ప‌డుతున్నాయ‌ని ఆమె అన్నారు. అన్నాడీఎంకేను చీల్చాల‌న్న కుట్ర‌లు ఎప్ప‌టికీ విజ‌య‌వంతం కాలేవ‌ని ఆమె స్ప‌ష్టంచేశారు. అమ్మ చ‌నిపోయిన స‌మ‌యంలోనే పార్టీ చీలిక‌కు కుట్రను తాను గుర్తించాన‌ని శ‌శిక‌ళ తెలిపారు.

మ‌రోవైపు ప‌న్నీర్ సెల్వానికి చెన్నై పోలీసులు షాకిచ్చారు. గోల్డెన్ బే రిసార్ట్స్‌ లో ఉన్న 119 ఎమ్మెల్యేలు త‌మ‌కు తాముగానే అక్క‌డ ఉన్నార‌ని, వారిని ఎవ‌రూ బంధించ‌లేద‌ని పోలీసులు ఇవాళ మ‌ద్రాస్ హైకోర్టుకు తెలిపారు. చెన్నై శివారులో రిసార్టులో శ‌శిక‌ళ ఎమ్మెల్యేల‌ను బంధించార‌ని ప‌న్నీరుసెల్వం వ‌ర్గం ఆరోపిస్తోంది. అయితే తాము మొత్తం 119 మంది ఎమ్మెల్యేల వాంగ్మూలాలు సేక‌రించామ‌ని పోలీసులు కోర్టుకు తెలిపారు. అందులో ఒక్క‌రిని కూడా అక్ర‌మంగా అక్క‌డ ఉంచ‌లేద‌ని, ఎవ‌రూ ఫిర్యాదు కూడా చేయ‌లేద‌ని పోలీసులు స్ప‌ష్టంచేశారు. ఈ కేసు వేసిన పిటిష‌న‌ర్‌.. అమిక‌స్ క్యూరీని ఏర్పాటుచేయాల్సిందిగా కోర్టును కోరారు. అయితే దీనిపై ప్ర‌భుత్వం త‌న వాద‌న‌ను వినిపించాల్సిందిగా కోర్టు ఆదేశించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News