వేద నిలయం వద్ద మారిన సీన్

Update: 2017-02-13 14:47 GMT
తమిళనాట నెలకొన్న రాజకీయ సంక్షోభంలో ఆసక్తికర అంశాలకు కొదవ లేదని చెప్పాలి. గంట గంటకూ మారుతున్న పరిణామాల నేపథ్యంలో పన్నీర్.. శశికళ వర్గాలు ఒకరికి మించి మరొకరు ఎత్తులు.. పైఎత్తులు వేసుకోవటం కనిపిస్తుంది. తాజాగా అలాంటి పరిణామం మరొకటిచోటు చేసుకుంది. నిన్నమొన్నటి వరకూ పోయెస్ గార్డెన్ లోని వేదనిలయం వద్ద పెద్ద సందడి లేదు. ఇందుకు భిన్నంగా పన్నీర్ సెల్వం ఇంటి వద్ద పెద్ద ఎత్తున సందడితో పాటు.. తమిళనాడు వ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి.. పన్నీర్ కు తమ మద్దతు ఉందని చెప్పటం కనిపించింది.

ఈ విషయం అన్ని ప్రసార మాధ్యమాల్లో ప్రముఖంగా కవర్ అయ్యింది. ఇలాంటివి ప్రతికూల పరిణామాలకు దారి తీయటంతో పాటు.. తమ వర్గంలోని ఎమ్మెల్యేల్లో అత్మ స్థైర్యాన్ని దెబ్బ తీసే అవకాశం ఉందన్న భావన శశికళ టీంకు అనిపించిందని చెబుతున్నారు. దీంతో.. వారు సరికొత్తగా పావులు కదిపినట్లుగా చెబుతున్నారు. నిన్నటివరకూ బోసిపోయినట్లు కనిపించిన వేదనిలయం సీన్ కు భిన్నంగా ఈ రోజు చిన్నమ్మకు మద్దతు పలుకుతూ పెద్ద ఎత్తున కార్యకర్తలు.. అభిమానులు చేరుకోవటం కనిపిస్తోంది.

ఆసక్తికరమైన మరో అంశం ఏమిటంటే.. నిన్నటివరకూ అయితే.. అమ్మ ఫోటోలు మాత్రమే కనిపించేవి. అందుకు భిన్నంగా ఈ రోజు వేదనిలయం వద్దకు చేరుకునే వారి చేతుల్లో అమ్మ.. చిన్నమ్మ ఫోటోలతో పాటు.. పార్టీ జెండాలు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. చూస్తుంటే.. పన్నీర్ ఇంటి దగ్గరి కోలాహలానికి ఏ మాత్రం తగ్గని రీతిలో వేదనిలయం వద్దా ఉండాలన్నట్లుగా శశికళ వర్గం భావిస్తోన్నట్లుగా పరిణామాలు నెలకొనటం గమనార్హం. అంతేకాదు.. ఈ రోజు వేదనిలయం వద్దకు వచ్చిన వారంతా.. పన్నీర్ అమ్ముడుపోయారంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడటం కనిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News