చిన్న‌మ్మ బ‌య‌ట‌కు వ‌చ్చారు.. అయితే..?

Update: 2017-10-06 12:28 GMT
చిన్న‌మ్మ‌కు పెరోల్ వ‌చ్చింది. దీంతో.. ఆమె జైలు నుంచి బ‌య‌ట‌కు రానున్నాయి. అయితే.. ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి మ‌రి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలుశిక్ష అనుభ‌విస్తున్న చిన్న‌మ్మ అలియాస్ శ‌శిక‌ళ‌కు కోర్టు ఎందుకు పెరోల్ మీద బ‌య‌ట‌కు పంపిందంటే.. అందుకు కార‌ణం లేక‌పోలేదు.

చిన్న‌మ్మ భ‌ర్త న‌ట‌రాజ‌న్‌ తీవ్ర అనారోగ్యంతో బాధ ప‌డుతున్నారు. ఈ మ‌ధ్య‌నే ఆయ‌న‌కు చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుప‌త్రిలో కిడ్నీ.. లివ‌ర్ మార్పిడి శ‌స్త్ర‌చికిత్స‌ను చేశారు. ఈ నేప‌థ్యంలో.. త‌న భ‌ర్త‌ను చూసేందుకు కోర్టు చిన్న‌మ్మ‌కు పెరోల్ మంజూరు చేసింది. భ‌ర్త‌ను చూసేందుకు.. పరామ‌ర్శించేందుకు ఆమెకు అయిదు రోజుల పాటు  పెరోల్ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన స‌మ‌యంలో ఆమేం చేయాలో.. ఏమేం చేయ‌కూడ‌దో కోర్టు ముంద‌స్తుగా అన్ని జాగ్ర‌త్త‌లు చెప్పేసింది.

భ‌ర్త అనారోగ్యంతో ఆసుప‌త్రికి చేరి.. ఆప‌రేష‌న్ స‌మ‌యంలో ఆమె పెరోల్ కోసం ద‌ర‌ఖాస్తు పెట్టుకున్నారు. అందులో త‌ప్పులు దొర్ల‌టంతో ఆమె ద‌ర‌ఖాస్తును కోర్టు తిర‌స్క‌రించింది. దీంతో.. త‌ప్పులు స‌రిదిద్ది మ‌రోసారి ద‌ర‌ఖాస్తు పెట్టుకున్నారు. తాజాగా పెట్టుకున్న పెరోల్ అప్లికేష‌న్ ను ప‌రిశీలించిన కోర్టు ఆమెకు ష‌ర‌తుల‌తో కూడిన పెరోల్‌ ను మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

తాజాగా మంజూరు చేసిన పెరోల్ నేప‌థ్యంలో శ‌శిక‌ళ త‌న బంధువుల ఇంట్లో ఉండేందుకు కోర్టు అవ‌కాశం ఇచ్చింది. జైలుకు వెళ్లిన ఎనిమిది నెల‌ల త‌ర్వాత చిన్న‌మ్మ తొలిసారి జైలు బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. పెరోల్ మీద బ‌య‌ట‌కు వ‌చ్చిన చిన్న‌మ్మ ఎవ‌రిని క‌ల‌వ‌కూడ‌ద‌ని.. త‌న బంధువుల ఇంట్లో మాత్ర‌మే ఉండాల‌ని.. ఆ స‌మ‌యంలో ఎలాంటి రాజ‌కీయ కార్య‌క‌లాపాలు.. మీడియాను క‌ల‌వ‌కూడ‌ద‌న్న స్ప‌ష్ట‌మైన ఆదేశాల్ని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మ‌రి.. పెరోల్ మీద బ‌య‌ట‌కు వ‌చ్చిన చిన్న‌మ్మ త‌న నెచ్చెలి అమ్మ స‌మాధి వ‌ద్ద‌కు వెళ్లి నివాళులు అర్పిస్తారా?  లేదా? అన్న‌ది ఆస‌క్తిక‌ర‌మైన అంశంగా చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News