మూడోఫ్రంట్ కూటమి దిశగా శశికళ!

Update: 2021-03-02 03:30 GMT
తమిళనాడులో అతి త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే రాజకీయ వేడి ఊపందుకుంది. ప్రధాన పార్టీలు సీట్ల సర్దుబాటు విషయంలో తలమునకలవుతుండగా.. చిన్నా చితకా పార్టీలు తమకు కలిసొచ్చే పార్టీతో మద్దతు తెలుపుకుంటున్నాయి. ఇందులో భాగంగా  జయలలిత నిచ్చెలి శశికళ గురించి రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అన్నాడీఎంకే పార్టీలో ప్రధాన కార్యదర్శిగా తానేనని చెప్పుకుంటున్న శశికళ ఇటీవల జైలు నుంచి విడుదల కావడంతో ఆ పార్టీలో మరింత వేడి రాజుకుంది.

అయితే అన్నాడీఎంకే నాయకులు శశికళను పట్టించుకోవడం లేదు. దీంతో ఆమె మూడో ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని సర్వేలు ఇప్పటికే డీఎంకేదే అధికారం అని చెబుతున్నారు.  ఈ నేపథ్యంలో అన్నా డీఎంకే, డీఎంకే ల్లోని అసంతృప్తులను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు శశికళ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరోవైపు చిన్నా చితక పార్టీలతో సంప్రదింపులు జరుపుతోంది. ఇటీవల సమత్తువ మక్కల్ కట్చి(ఎస్ఎంకే) పార్టీ అధినేత శరత్ కుమార్ తో చర్చలు జరిపారు. దీంతో ఆమె మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయడం ఖాయమనే తెలుస్తోంది.

అలాగే తమిళ సూపర్ స్టార్ నటుల్లో ఒకరైన కమలాసన్ మక్కళ్ నీది మయ్యం(ఎంఎన్ఎం) పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. గత పార్లమెంట్ ఎన్నికల్లో కమల్ పార్టీ పోటీ చేసినా స్పందన రాలేదు. దీంతో ఆయన ఒంటరిగా కాకుండా శశికళతో వెళ్తే ప్రయోజనం ఉండొచ్చని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో త్వరలో ఆయన శశికళతో సమావేశం కానున్నట్లు సమాచారం.

234 అసెంబ్లీ సీట్లున్న రాష్ట్రంలో ఇలాంటివి కొత్తేమీ కాదు. కానీ సరిగ్గా ఎన్నికల ముందే జైలు నుంచి విడుదలయిన శశికళ మూడో ఫ్రంట్ పై అందరిదృష్టి పడింది. అయితే వచ్చే ఎన్నికల్లో ఈ కూటమి అధికారంలోకి రాకున్నా కీలకంగా ఉన్నబెటరనే ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళ ప్రజలు శశికళపై ఎలాంటి సానుభూతి చూపిస్తారో చూడాలి.
Tags:    

Similar News