జ‌గ‌న్ ఏనాడూ అలా చేయ‌లేదు - స‌తీష్ రెడ్డి వ్యాఖ్య‌లు!

Update: 2020-03-14 16:39 GMT
ఒక‌వైపు తెలుగుదేశం పార్టీ గ‌గ్గోలు పెడుతూ ఉంది. త‌మ పార్టీ వాళ్ల‌ను స్థానిక ఎన్నిక‌ల్లో క‌నీసం నామినేష‌న్లు దాఖ‌లు చేయనివ్వ‌డం లేద‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు తో స‌హా ఆ పార్టీ నేత‌లు ప‌లువురు చెబుతూ ఉన్నారు. అయితే తామెక్క‌డా తెలుగుదేశం పార్టీ వాళ్ల‌ను అడ్డుకోలేద‌ని, అభ్య‌ర్థులు దొర‌క్క చంద్ర‌బాబు నాయుడు అలా మాట్లాడుతూ ఉన్నార‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు అంటున్నారు. తాము అడ్డుకుని ఉంటే తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున ఎంపీటీసీ స్థానాల‌కు 18 వేల నామినేష‌న్లు దాఖ‌లు అయ్యేవా? అంటూ ఏపీ మంత్రులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు ప్ర‌శ్నిస్తూ ఉన్నారు.

ఇలా ఆరోప‌ణ‌లు, వివ‌ర‌ణ‌ల నేప‌థ్యం లో.. వైఎస్ కుటుంబానికి చాన్నాళ్లుగా రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థిగా వ్య‌వ‌హ‌రించిన స‌తీష్ రెడ్డి ఆస‌క్తిదాయ‌క‌మైన విష‌యాన్ని చెప్పారు. పులివెందుల్లో అటు వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డికి వ్య‌తిరేకంగా, ఇటు జ‌గ‌న్ కు వ్య‌తిరేకంగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన చ‌రిత్ర ఉంది స‌తీష్ రెడ్డికి. అది కూడా వైఎస్ సీఎం హోదాలో ఉన్న‌ప్పుడు ఈయ‌న ఢీ కొన్నారు, అలాగే గ‌త ఎన్నిక‌ల్లోనూ జ‌గ‌న్ కు వ్య‌తిరేకంగా టీడీపీ అభ్య‌ర్థిగా నిలిచారు.

అయితే వైఎస్ కుటుంబీకులు ఎప్పుడూ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌ను అక్ర‌మంగా చేయ‌లేద‌ని అంటున్నారు స‌తీష్ రెడ్డి. జ‌గ‌న్ కు వ్య‌తిరేకంగానే త‌ను పోటీ చేసిన అనుభంతో చెబుతున్న‌ట్టుగా ఆయ‌న చెప్పారు. ఒక టీవీ చాన‌ల్ లో స‌త్తిరెడ్డి ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఎక్క‌డా బూత్ క్యాప్చ‌రింగ్ చేయ‌డం కానీ, తెలుగుదేశం పార్టీకి ఏజెంట్లు లేకుండా చేయ‌డం కానీ లేద‌ని.. అన్ని చోట్టా పోలింగ్ స‌వ్యంగా సాగింద‌ని ఆయ‌న చెబుతున్నారు. తెలుగుదేశం అభ్య‌ర్థిగా వైఎస్ కుటుంబానికి వ్య‌తిరేకంగా పోటీ చేసిన‌ప్పుడు.. త‌న అనుభ‌వాల‌ను ఈ విధంగా వివ‌రించారు స‌తీష్ రెడ్డి. ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ అక్ర‌మాలు చేయిస్తున్నార‌ని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తూ ఉండ‌గా, స‌రిగ్గా ఈ స‌మ‌యంలోనే స‌తీష్ రెడ్డి.. పులివెందుల్లో ఎప్పుడూ పోలింగ్ ప్ర‌శాంతంగా జ‌రిగింద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News