ఆ రెండు చోట్ల స‌త్య‌నాదెళ్ల ఏం చేశారు?

Update: 2015-12-28 09:16 GMT
హైద‌రాబాద్‌ కు వ‌చ్చిన మైక్రోసాఫ్ట్ సీఈవో స‌త్య‌నాదెళ్ల  సోమ‌వారం బిజీబిజీగా ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్య‌ల‌తో ఆయ‌న చ‌ర్చ‌లు జ‌రిపారు. ఉద‌యం 8.30 గంట‌ల‌కు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడ్ని హైద‌రాబాద్‌లోని ఆయ‌న స్వ‌గృహంలో క‌లిశారు. ఈ సంద‌ర్భంగా వీరిద్ద‌రి మ‌ధ్యా 1.20గంట‌ల‌పాటు చ‌ర్చ‌లు సాగాయి. ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాల‌పై వీరిమ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్లు చెబుతున్నారు. ఈ సంద‌ర్భంగా స‌త్య‌నాదెళ్ల‌కు చంద్ర‌బాబు అల్పాహార విందును ఏర్పాటు చేశారు.

పౌర‌సేవ‌లు.. విద్య‌.. వ్య‌వ‌సాయం త‌దిత‌ర రంగాల్లో మెరుగైన అభివృద్ధి.. స‌మాచార సేక‌ర‌ణ త‌దిత‌ర అంశాల‌పై మైక్రోసాఫ్ట్ తో ఏపీ స‌ర్కారు ఒప్పందం కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్‌ను ఐటీ హబ్‌ గా మార్చేందుకు వీలుగా కొన్ని అంశాల‌పై స‌త్య‌నాదెళ్ల‌తో చంద్ర‌బాబు చ‌ర్చించిన‌ట్లు చెబుతున్నారు. మైక్రోసాఫ్ట్ కార్యాల‌యాన్ని విశాఖ‌ప‌ట్నంలో ఏర్పాటు చేయాల‌ని చంద్ర‌బాబు కోర‌గా.. అందుకు స‌త్య‌నాదెళ్ల సానుకూలంగా స్పందించిన‌ట్లుగా తెలుస్తోంది. అనంత‌పురంలో సంద‌ర్శించాల‌ని కోర‌గా..త‌ర్వాత ప‌ర్య‌ట‌న‌లో తాను త‌ప్ప‌క ప‌ర్య‌టిస్తాన‌ని చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు.

అనంత‌రం స‌త్య‌నాదెళ్ల‌.. హైద‌రాబాద్‌ లోని టీ హ‌బ్‌ ను సంద‌ర్శించారు. ఆయ‌నకు.. తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ స్వాగ‌తం ప‌లికారు. ఈ మ‌ధ్య‌నే ప్రారంభించిన టీ హ‌బ్ విశేషాల‌ను వివ‌రించారు. టీ హ‌బ్ లోని స్టార్ట‌ప్ లతో ఆయ‌న భేటీ అయ్యారు. స్టార్ట‌ప్ ల‌తో భేటీ కావ‌టం త‌న‌కు ఉత్సాహం క‌లిగిచింద‌ని స‌త్య‌నాదెళ్ల వ్యాఖ్యానించారు. టీహ‌బ్‌ తో క‌లిసి మైక్రోసాఫ్ట్ క‌లిసి ప‌ని చేస్తుంద‌ని వెల్ల‌డించిన స‌త్య‌నాదెళ్ల‌.. ఐటీలో భార‌త్ హ‌వా న‌డుస్తుంద‌ని.. త్వ‌ర‌లో ఆ రంగాన్ని భార‌తీయులు శాసించే స్థాయికి చేరుకుంటార‌ని వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News