పాటపాడింది ఆటలో అరటిపండు!

Update: 2017-09-21 03:56 GMT
సదావర్తి భూముల వ్యవహారం మరో ట్విస్టు తిరిగింది. 60.30 కోట్లకు ఈ భూములను కొనుగోలు చేయడానికి ఫైనల్ గా వేలం పాటలో పాడుకున్న కడప జిల్లాకు చెందిన సత్యనారాయణ రెడ్డి.. తన పాటను ఉపసంహరించుకున్నారు. సదావర్తి భూములను తీసుకోవడం తనకు ఇష్టం లేదంటూ వెనక్కు తగ్గారు. దీంతో రెండో బిడ్డర్ కు భూములను ఇచ్చేస్తున్నట్లుగా దేవాదాయ శాఖ ప్రకటించింది. రెండో బిడ్డర్ కేవలం 5 లక్షలు తక్కువ కోట్ చేసి ఉన్నారని ప్రకటించారు.

అయితే అంత విలువైన భూములను పాటలో సొంతం చేసుకున్న తర్వాత కూడా తమకు వద్దంటూ వెనక్కు తగ్గడం ఏమిటి? ఎందుకు అలా జరిగింది? అనే విషయంలో రకరకాల ప్రచారాలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం నాయకుల స్కెచ్ మేరకే సత్యనారాయణ రెడ్డి పాట పాడినట్లుగా కొన్ని పుకార్లు వచ్చాయి. వీటికి ముడిపెట్టి తమ మీద కొందరు నిందారోపణలు చేస్తున్నారని అందుకే తాము భూములు తీసుకోదలచుకోలేదని సత్యనారాయణ రెడ్డి ప్రకటించారు.

అయితే ప్రజల్లో మాత్రం కొత్త సందేహాలు కలుగుతున్నాయి. అంతిమంగా భూములు ఎవరికి దక్కాలి.. అనే విషయంలో తెదేపా పెద్దలు నిర్దిష్టమైన స్కెచ్ వేశారని.. పాట ఎవరు పాడిన సరే.. వారు కేవలం ఆటలో అరటి పండు మాత్రమేనని.. అనుకుంటున్నారు. సూచనల ప్రకారం దక్కవలసిన వారికి స్థలాలు దక్కేలా చేయడానికే ఇప్పుడు సత్యనారాయణరెడ్డి ఇలా స్థలాలను త్యాగం చేస్తుండవచ్చునని కూడా వినిపిస్తోంది.

కేవలం ఎవరో ఏదో నిందలు వేస్తున్నారనే కారణం మీద ఒక రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ వందల కోట్ల విలువైన భూములను కేవలం 60 కోట్లకు సొంతం చేసుకోవడం వంటి డీల్ ను వదులుకుంటుందా? అనేది అందరికీ కలుగుతున్న సందేహం. ఇంత పెద్ద డీల్ లో ఎలాంటి విమర్శలు, పుకార్లు లేకుండానే పూర్తవుతుందని ఆయన అనుకున్నారా? అని జనం ప్రశ్నిస్తున్నారు. పైకి చెబుతున్నవన్నీ నిజం కాదని సదావర్తి భూముల వ్యవహారం మొత్తం ఒక స్కెచ్ ప్రకారం నడుస్తున్నదని అనుకుంటున్నారు.
Tags:    

Similar News