భార‌తీయుల‌కు సౌదీ స‌ర్కార్ షాక్!

Update: 2018-02-06 17:59 GMT
అమెరిక‌న్ల‌లోని `లోక‌ల్ సెంటిమెంట్ `ను రెచ్చ‌గొట్టి....అమెరికా అధ్య‌క్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప‌ద‌వి చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. అమెరిక‌న్ల ఉద్యోగాలు...అమెరిక‌న్ల‌కే అంటూ ట్రంప్ ఓ నినాదాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డంలో స‌క్సెస్ అయ్యారు. ‘మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌’ పేరుతో ట్రంప్ ...ఇత‌ర దేశాల వారికి జారీ చేసే వీసాలపై క‌త్తెర వేశారు. తాజాగా, మ‌రో `క‌ల‌ల‌` దేశం అమెరికా బాట‌లో ప‌య‌నిస్తోంది. తాజాగా, సౌదీ అరేబియా కూడా త‌మ దేశంలోని  12 రంగాల్లో పనిచేస్తున్న విదేశీయులపై నిషేధం విధిస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఆ విదేశీయుల‌లో ఎక్కువ‌మంది భారతీయులు కూడా ఉన్నారు.

తాజాగా, సౌదీ నిర్ణయంతో ఆ  12 రంగాల్లో పనిచేస్తున్న భారతీయుల భ‌విష్య‌త్తు ప్రశ్నార్థకంగా మారింది. సౌదీ స‌ర్కార్ తాజా నిర్ణయం దాదాపు కోటీ ఇరవై లక్షల మంది విదేశీయులపై, 30 లక్షల మంది భారతీయులపై ప్రభావం చూపనుంది.  ఆ నిర్ణయం ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్‌ 11 నుంచి ఆ 12 రంగాల్లో కేవ‌లం స్థానికుల‌కు మాత్ర‌మే ఉద్యోగాలు ల‌భిస్తాయి. కార్లు - మోటార్‌ బైక్‌ షోరూంలు - రెడీమేడ్‌ దుస్తుల దుకాణాలు - ఫర్నిచర్‌ దుకాణాలు - గృహాలంకరణ దుకాణాలలో ప‌నిచేసేవారికి సెప్టెంబ‌ర్ 11 డెడ్ లైన్. నవంబర్‌ 9 నుంచి విదేశాలకు చెందిన ఉద్యోగులను ఎలక్ట్రానిక్‌ - చేతి గడియారాలు - ఆప్టిక్‌ దుకాణాలలో ఎంపికచేసుకోరు. 2019 - జనవరి 7 నుంచి వైద్య పరికరాల దుకాణాలు - బిల్డింగ్‌ మెటీరియల్‌ - ఆటో స్పేర్‌ పార్టుల దుకాణాలు - తివాచీలు - మిఠాయి దుకాణాలలో విదేశీయులకు ఉద్యోగాలు లేన‌ట్లే. సౌదీలో 15 నుంచి 24 ఏళ్ల వయసున్న యువకులు  నిరుద్యోగులుగా మిగిలిపోతుండ‌డంతో సౌదీ స‌ర్కార్ ఈ నిర్ణ‌యం తీసుకుంది. గత ఏడాది ఆ వయసున్న నిరుద్యోగుల సంఖ్య 32.6 శాతంగా న‌మోద‌వ‌డంతో సౌదీ ఈ చ‌ర్య‌ల‌ను చేప‌ట్టింది. 2020 నాటికి సౌదీలో స్థానిక యువ‌త‌కు నిరుద్యోగం లేకుండా చేయాలన్నదే స‌ర్కార్ ఉద్దేశం.

Tags:    

Similar News