షాకిద్దామ‌నుకుంటే కాంగ్రెస్‌ కు ట్విస్ట్ ఎదురైంది

Update: 2017-12-15 17:14 GMT
కాంగ్రెస్ పార్టీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్‌లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని, వీటిలో కనీసం 25 శాతం ఈవీఎంలను వీవీపాట్ మెషిన్లలో పరిశీలించేలా ఆదేశాలు జారీ చేయాలన్న కాంగ్రెస్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. అసలు కాంగ్రెస్ పిటిషన్‌లో అర్థమే లేదని కోర్టు స్పష్టంచేసింది. ఎన్నికల సంస్కరణలు తీసుకురావాల్సిందిగా రిట్ పిటిషన్ దాఖలు చేయాలని గుజరాత్ కాంగ్రెస్‌కు సూచించింది. అంతేకాదు ఎన్నికల సంఘం విధుల్లో తాము జోక్యం చేసుకోలేమని కూడా స్పష్టంచేసింది.

` ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఓ పార్టీ ఆరోపణల ఆధారంగా అందులో జోక్యం చేసుకోవడం సరికాదు` అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గుజరాత్ ఎన్నికల పోలింగ్‌లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని గుజరాత్ కాంగ్రెస్ ఆరోపించింది. అంతేకాదు ఈవీఎంలకు బ్లూటూత్‌ను కనెక్ట్ చేశారని కూడా ఆ పార్టీ చెబుతున్నది. ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే సాకుల కోసం వెతుకుతున్నదని బీజేపీ విమర్శిస్తోంది.

కాగా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిన సంగ‌తి తెలిసిందే. దాదాపు నెల రోజులకు పైగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య జరిగిన యుద్ధానికి తెరపడింది. రెండో దశలో మొత్తం 93 స్థానాలకు పోలింగ్ జరగగా… 68.70 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచే కొన్ని పోలింగ్ బూత్‌ ల వద్ద ఓటర్లు క్యూ కట్టగా మరికొన్ని చోట్ల పోలింగ్ మందకొడిగా సాగింది. ఐతే సాయంత్రం వరకు ఓటింగ్ పుంజుకుంది. అటు మొదటి దశలో 89 స్థానాలకు ఈ నెల 9 పోలింగ్‌ జరగగా… 66 శాతం పోలింగ్ నమోదైంది. రెండు దశల్లో మొత్తం 182 స్థానాలకు ఈసీ పోలింగ్ నిర్వహించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది.

రెండో దశలో ప్రధాని సహా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సబర్మతి రాణిప్ లోని 115 వ నెంబర్ బూత్ లో ప్రధాని ఓటు వేశారు. కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ అహ్మదాబాద్ లోని వెజల్పూర్ పోలింగ్ బూత్ లో ఓటు వేయగా, మెహసాన్ లో గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నారణ్పూర్‌ లో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కుటుంబంతో కలిసి ఓటు వేశారు. ఇటీవల కాంగ్రెస్ కు రాజీనామా చేసి కొత్త పార్టీ ఏర్పాటు చేసిన మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా గాంధీనగర్ లో ఓటు వేశారు. ఇక పాటీదార్ అనామత్ సమితి నేత హార్ధిక్ పటేల్ తన స్వగ్రామమైన వీరమ్‌గామ్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ప్రధాని మోడీ సొంతరాష్ట్రం కావటంతో ఈ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. గుజరాత్ లో బీజేపీ, కాంగ్రెస్ ల మధ్యే గట్టిపోటీ ఉంది. ఎలాగైనా మళ్లీ గుజరాత్ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రధాని మోడీ తీవ్రంగా ప్రచారం నిర్వహించారు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు చేపట్టిన పథకాలను మోడీ పదేపదే ప్రజలకు గుర్తు చేశారు. దీనికి తోడు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పై విమర్శలకు దిగారు. మణిశంకర్‌ అయ్యర్‌ వ్యాఖ్యలు, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ పాక్ విదేశాంగ మంత్రితో సమావేశం కావటాన్ని ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు.
Tags:    

Similar News