భూతద్దం వేసుకొని వెతికినా విక్రమ్ కనిపించట్లేదట

Update: 2019-10-24 05:14 GMT
చేతి వరకూ వచ్చిన విజయం చివరి క్షణంలో చేజారితే ఎలా ఉంటుందో చంద్రయాన్ 2 ఎపిసోడ్ తో దేశ ప్రజలకు మరోసారి అనుభవంలోకి వచ్చింది. ఇస్రో శాస్త్రవేత్తల పనితీరును తక్కువ చేసి చూపించలేకున్నా.. కలిసి రాని కాలంతో ఇలాంటి పరిస్థితి నెలకొందని చెప్పక తప్పలేదు. ప్రయోగం గ్రాండ్ సక్సెస్ అని ప్రకటించటానికి కొన్ని నిమిషాల ముందు అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామంతో చంద్రుడి ఉపరితలం మీద ల్యాండ్ కావాల్సిన విక్రమ్ ల్యాండర్ క్రాష్ ల్యాండ్ కావటంతో సంబంధాలు తెగిపోయాయి.

సాఫ్ట్ ల్యాండింగ్ కు భిన్నంగా క్రాష్ ల్యాండింగ్ కారణంగానే విక్రమ్ ఇబ్బందులు ఎదుర్కొందని.. బలంగా చంద్రుడి ఉపరితలాన్ని ఢీ కొనటంతో పల్టీ కొట్టిందన్న వాదన వినిపించింది. ఈ ప్రయోగం తర్వాత విక్రమ్ ఆచూకీ కోసం చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. చంద్రుడి మీద పగలు పూర్తి అయి రాత్రి మొదలు కావటంతో వెతుకులాటకు అవకాశం లేకుండా పోయింది.
చంద్రుడి దక్షిణ ధ్రువంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి తాజాగా విక్రమ్ కోసం వెతుకులాటను ఇస్రో చేపట్టింది. అయినప్పటికీ.. దాని జాడ కనిపించలేదని చెబుతున్నారు. భూమితో సంబంధాలు కోల్పోయిన విక్రమ్ ఎక్కడ ఉంది? ఇప్పుడెలా ఉంది? దాని పొజిషన్ ఏమిటి? ఏ మేరకు దెబ్బ తింది? లాంటి అంశాల్ని అధ్యయనం చేసేందుకు విక్రమ్ ఆచూకీ చాలా అవసరం.

ఈ నేపథ్యంలో నాసాకు చెందిన లూనార్ రికనోయిసెన్స్ ఆర్బిటర్ అక్టోబరు 14న చంద్రుడి దక్షిణ ధ్రువం ఫోటోల్ని తీసింది. వీటిని నిశితంగా పరిశీలించిన నాసా శాస్త్రవేత్తలకు విక్రమ్ ఆచూకీ ఎక్కడా కనిపించలేదని చెబుతున్నారు. తాజాగా తీసిన ఫోటోల్ని క్షుణ్ణంగా పరిశీలించినా.. ఎక్కడా విక్రమ్ జాడ లేకపోవటంతో.. ఇప్పుడెక్కడ ఉందన్నది ప్రశ్నగా మారింది. అయితే.. తాము తీసిన ఫోటో ప్రాంతంలో కాకుండా.. దాని అవతల ఉందేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. విక్రమ్ కోసం వెతుకులాట మరెన్ని రోజులు సాగుతుందో చూడాలి.
Tags:    

Similar News