సీజ‌నల్ వ్యాధుల‌పై అప్ర‌మ‌త్త‌మైన తెలంగాణ‌

Update: 2020-05-18 03:45 GMT
ప్ర‌స్తుతం భూమిపై ప‌రిస్థితులు బాగాలేవు. ఇప్ప‌టికే క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభించి మాన‌వ ప్ర‌పంచాన్ని చిగురుటాకుల వ‌ణికిస్తోంది. ఉష్ణోగ్ర‌త‌లు తీవ్రంగా ఉండే మండు వేస‌వికాలంలోనే క‌రోనా వైర‌స్ తీవ్రంగా దాడి చేస్తుంటే త్వ‌ర‌లోనే వ‌ర్షాకాలం ప్రారంభం కానుంది. ఈ స‌మ‌యంలో ఆ వైర‌స్ మ‌రింత తీవ్రంగా ప్ర‌బ‌లే అవ‌కాశం ఉంది. దానికి తోడు కాలం మారుతుందంటే వ్యాధులు వ్యాపించే స‌మ‌యం. సీజ‌న‌ల్ వ్యాధులు వ్యాపించకుండా తెలంగాణ ముందే అప్ర‌మ‌త్త‌మైంది. ఇప్ప‌టికే క‌రోనాతో ప్ర‌జ‌లు స‌హ‌వాసం చేసే ప‌రిస్థితి ఏర్ప‌డింది. వ‌ర్షాకాలంలో సీజ‌న‌ల్ వ్యాధులు వ్యాపిస్తే రాష్ట్ర‌మంతా రోగాల‌మ‌యం అవుతుంద‌ని ఊహించి ఇప్ప‌టి నుంచే క‌ట్ట‌డి చ‌ర్య‌లు చేప‌ట్టారు.

ఈ సంద‌ర్భంగా మున్సిప‌ల్‌, ఐటీ శాఖ మంత్రి క‌ల్వ‌కుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) క‌ట్ట‌డి చ‌ర్య‌ల‌పై కార్యాచ‌ర‌ణ రూపొందించారు. సీజ‌న‌ల్ వ్యాధులు వ్యాపించ‌కుండా ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ చేప‌ట్టారు. త‌న శాఖ ప‌రిధిలోని అంశం కావ‌డంతో ప‌రిశుభ్ర‌తా చ‌ర్య‌లు ఉండేలా.. వ్యాధులు వ్యాపించ‌కుండా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో స‌రికొత్త కార్య‌క్ర‌మం రూపొందించారు. ‘‘ ప్రతి ఆదివారం- పది గంటలకి- పది నిమిషాలు’’ కార్యక్రమం చేయాల‌ని కేటీఆర్ పిలుపునిచ్చారు. రోగా‌ల బారి నుంచి కుటుంబాలు, పట్టణాలను, ప్రజలను కాపాడుకోవాలని కోరారు. సీజనల్ వ్యాధులను కలిసికట్టుగా ఎదుర్కొందామంటూ ఈ సంద‌ర్భంగా ఆదివారం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, మున్సిపల్ చైర్ పర్సన్లకు త‌దిత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు అంద‌రికీ కేటీఆర్ బ‌హిరంగ లేఖ రాశారు. ప‌రిశుభ్ర‌త చ‌ర్య‌ల్లో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు.

పురపాలక శాఖ చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేయాలని ప్ర‌జాప్ర‌తినిధుల‌కు చెప్పారు. సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు పకడ్బందీ ప్రణాళికతో పురపాలక శాఖ ముందుకు వెళ్తోందని తెలిపారు. పురపాలక శాఖ కార్యక్రమాలతో కలిసి రావాలని ప్రజలను కోరారు.


Tags:    

Similar News