సెకండ్ వేవ్ : కరోనా సింప్టమ్స్ లో మార్పు ... శ్వాస సమస్యే ఎక్కువట !

Update: 2021-04-20 08:30 GMT
దేశంలో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ మాట్లాడుతూ..ఫస్ట్ వేవ్ తో పోలిస్తే ప్రస్తుత సెకండ్ వేవ్ లో సింప్టమ్స్ లో భారీగా మార్పులు చోటు చేసుకున్నాయని అన్నారు. ఫస్ట్ వేవ్ లో కరోనా బారిన పడినవారికి జ్వరం, పొడి దగ్గు, బాడీ పెయిన్స్, కీళ్ల నొప్పులు, అలసట, వాసన తెలియకపోవడం, గొంతు నొప్పి, శ్వాస ఇబ్బంది వంటి సింప్టమ్స్ ఎక్కువగా కన్పించాయని, ఇప్పుడు శ్వాస ఇబ్బందే ఎక్కువగా కనిపిస్తున్నాయని అన్నారు. దీనితో ప్రస్తుతం కరోనా భారిన పడే వారికి ఆక్సిజన్ అవసరం పెరిగిపోతుంది అని అన్నారు. సెకండ్ వేవ్ లో కేసుల పెరుగుదలకు డబుల్ మ్యుటెంట్ కరోనానే కారణమా అనేది ఇంకా నిర్దారణ కాలేదు అని అన్నారు.

ఫస్ట్ వేవ్ లో 0 నుంచి 19 ఏళ్ల మధ్య వారిలో ఇన్ఫెక్షన్ రేటు 5.8 శాతం ఉండగా, ఇప్పుడు 4.2 శాతం ఉందని అయన అన్నారు. 20 నుంచి 40 ఏళ్ల ఏజ్ గ్రూపులో ఇన్ఫెక్షన్ రేటు అప్పుడు 25 శాతం ఉండగా, ఇప్పుడు కొంచెం తక్కువగా 23 శాతం ఉందని తెలిపారు. రెండు వేవ్స్ లోనూ కరోనా బారిన పడినవారిలో 40 ఏళ్లకు పైబడినవాళ్లే 70 శాతం ఉన్నారని తెలిపారు. ఫస్ట్ వేవ్ లో యావరేజ్ గా 50 ఏళ్ల వారికి కరోనా  బాగా సోకిందని, సెకండ్ వేవ్ లోనూ యావరేజ్ గా 49 ఏళ్ల వయసు వారికి ఎక్కువగా వ్యాపిస్తోందన్నారు. ప్రస్తుత వేవ్ లోనూ వృద్ధులకు ప్రమాదం ఎక్కువే ఉందన్నారు. ప్రస్తుతం అసింప్టమాటిక్, స్వల్ప అనారోగ్యం బారిన పడిన కరోనా పేషెంట్లు ఇంటి వద్దే జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని చెప్పారు. ఆర్టీ పీసీఆర్ పద్ధతి బెస్ట్ అని, దీనితో ఎలాంటి కరోనా మ్యుటెంట్ ను అయినా కచ్చితంగా గుర్తించొచ్చని స్పష్టం చేశారు. అయితే కరోనాపై పోరాటంలో ప్రజలు తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారని, తగిన జాగ్రత్తలు పాటించడం లేదని అయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ కూడా కరోనా నియమాలు పాటించాలని కోరారు.
Tags:    

Similar News