కాంగ్రెస్ లో పెరగనున్న సీత‌క్క ప్రాభ‌వం!

Update: 2021-07-17 23:30 GMT
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నెల క్రితం ప‌రిస్థితి వేరు.. ప్ర‌స్తుత కండీష‌న్‌వేరు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత‌.. ఎంతో మార్పు వ‌చ్చింది. అది స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. కేడ‌ర్ లో ఇంత‌కు ముందెన్న‌డూ లేనంతగా జోష్ పెరిగింది. అదే స‌మ‌యంలో.. ప‌నిచేసే వాళ్ల‌కు అవ‌కాశాలు వ‌స్తాయ‌నే చ‌ర్చ‌కూడా మొద‌లైంది. మొన్న‌టి వ‌ర‌కు సీనియ‌ర్ అనే బోర్డును మెడ‌లో వేసుకొని.. తిరిగేవారికే కాంగ్రెస్ లో ప్రాధాన్యం ద‌క్కుతుంద‌నే ప్ర‌చారం ఉండేది. కానీ.. ఇప్పుడు క్ర‌మంగా ఈ ప‌రిస్థితి మారే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు. ఇలా చూసుకున్న‌ప్పుడు తెలంగాణ‌లో రేవంత్ రెడ్డి త‌ర్వాత ప్లేస్‌ సీత‌క్కదేన‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

గ‌డిచిన ద‌శాబ్ద కాలంలో రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవ‌డంతో.. సీనియ‌ర్లుగా ఉన్న నేతలంతా డీలా ప‌డిపోయారు. అడ‌పాద‌డ‌పా ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌డం.. మీడియా మీతో మాట్లాడ‌డం త‌ప్ప‌.. వారు చేసిందేమీ లేద‌న్న‌ది ప్ర‌ధాన ఆరోప‌ణ‌. సొంత పార్టీ కేడ‌ర్ నుంచే ఈ విమ‌ర్శ‌లు వినిపించాయి. రేవంత్ కు పీసీసీ ద‌క్క‌డంలోనూ ప్ర‌ధాన కార‌ణం ఇదే అన్న‌ది అంద‌రికీ తెలిసిందే. అయితే.. సీత‌క్క మాత్రం సైలెంట్ గా లేరు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉన్నారు. క‌రోనా వంటి ప‌రిస్థితుల్లోనూ వారికి సేవ‌లు అందించేందుకు స్వ‌యంగా క్షేత్ర‌స్థాయికి వెళ్లారు. ములుగు నియోజ‌క‌వ‌ర్గంలోని ఏజెన్సీ ప్రాంతంలో మందులు మోస్తూ తిరిగారు. త‌ద్వారా.. తాను ప‌నిచేసే నాయ‌కురాలిని అని నిరూపించుకున్నారు.

ఇలాంటి నేత‌కు ఇప్పుడు అవ‌కాశం వ‌చ్చింద‌నే ప్ర‌చారం సాగుతోంది. ఇన్నాళ్లూ త‌న నియోజ‌క‌వ‌ర్గానికి మాత్ర‌మే ప‌రిమితమైన సీత‌క్క‌.. ఆ బౌండ‌రీని దాట‌బోతున్నార‌ని చెబుతున్నారు. క్ర‌మంగా ఉత్తర తెలంగాణలో బ‌ల‌మైన నేత‌గా మారేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్య‌క్షుడిగా మారిన త‌ర్వాత ప‌నిచేసే వారికి ప్రాధాన్య‌త క‌ల్పిస్తార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. హైక‌మాండ్ నుంచి ఫుల్ స‌పోర్ట్ ఉండ‌డంతో.. రేవంత్ మంచి దూకుడు మీదున్నారు. అంతేకాకుండా.. త‌న కోట‌రీని కూడా నిర్మించుకోవ‌డం అనివార్యం. అందువ‌ల్ల సీత‌క్క వంటివారికి లిఫ్ట్ ఇచ్చే అవ‌కాశం ఖ‌చ్చితంగా ఉంద‌ని అంటున్నారు.

ఇందులో భాగంగా త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న కోల్ బెల్ట్ ఎన్నిక‌ల బాధ్య‌త‌ను సీత‌క్క‌కు అప్ప‌గించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. బొగ్గు గ‌నుల విష‌యానికి వ‌స్తే.. మందమరి, భూపాలప‌ల్లి, రామగుండం, ఇల్లెందు, మణుగూరు, గోదావరిఖని, కొత్త‌గూడెం నియోజ‌క‌వ‌ర్గాల్లో విస్త‌రించి ఉన్నాయి. ఇక్క‌డ ప్ర‌భావం చూపించ‌డం ద్వారా.. ఈ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో బ‌ల‌మైన నేత‌గా మారే అవ‌కాశం ఉంది. త‌ద్వారా సీత‌క్క ప్రొఫైల్ కూడా హైలైట్ అవ‌డానికి అవ‌కాశం ఉంది. ఈ విధంగా.. రాబోయే రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ లో ములుగు ఎమ్మెల్యే సీత‌క్క‌ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

అయితే.. ఈ మార్పును అడ్డుకునే ప్ర‌య‌త్నాలు చేసేవారు కూడా ఉండొచ్చు. కానీ.. తెలంగాణ కాంగ్రెస్ లో సీనియ‌ర్లుగా ఉన్న‌వారంతా ప్ర‌స్తుతం దాదాపుగా సైలెంట్ అయిపోయిన‌ట్టుగానే క‌నిపిస్తున్నారు. చాలా మందికి వ‌య‌సు మీద ప‌డింది. మిగిలిన వారిలో రేవంత్ రెడ్డికి ప‌గ్గాలు అప్ప‌గించార‌నే ఉక్రోషం ఉంది. అందువ‌ల్ల యాక్టివ్ గా ముందుకు వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువేన‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు వంటి నాయకులు మాత్రమే తెలంగాణ కాంగ్రెస్ లో యాక్టివ్ కావ‌డానికి స్కోప్ ఉంది. కానీ.. వారు ఎంత మేర‌కు క్రియాశీల‌కం అవుతార‌న్న‌దానికి కాల‌మే స‌మాధానం చెప్పాలి. ఈ విధంగా చూసుకున్న‌ప్పుడు.. రేవంత్ రెడ్డి త‌ర్వాత కాంగ్రెస్ లో కీల‌క నేత‌గా ఎదిగే అవ‌కాశం సీత‌క్కకు పుష్క‌లంగా ఉంద‌ని అంటున్నారు. మ‌రి, ఏం జ‌రుగుతుంది? అన్న‌ది చూడాలి.
Tags:    

Similar News