వైఎస్సార్ ఆప్తుడు సైకిలెక్కేస్తారా...?

Update: 2023-01-08 04:45 GMT
ఆయన వైఎస్సార్ కి అత్యంత సన్నిహితుడు. ఆప్తుడు. ఆయన రాజకీయ జీవితంలో వైఎస్సార్ పాత్ర చాలా ఉంది. ఆయనే ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణ. ఆయన 1989లో కేవలం తొమ్మిది ఓట్లతో అనకాపల్లి నుంచి లోక్ సభకు గెలిచారు. అప్పట్లో అది గిన్నీస్ రికార్డుగా నమోదు అయింది.

ఆ సమయంలో వైఎస్సార్ కూడా ఫస్ట్ టైం కడప నుంచి లోక్ సభకు నెగ్గారు. అలా ఇద్దరి మధ్యన మంచి సాన్నిహిత్యం ఢిల్లీ వేదికగా కుదిరింది. ఆ తరువాత వైఎస్సార్ పీసీసీ చీఫ్ అయినపుడు విశాఖ జిల్లాలో కొణతాల రామక్రిష్ణ కీలకంగా వ్యవహరించేవారు. ఇక వైఎస్సార్ పాదయాత్రలో కూడా తాను చురుకైన పాత్ర పోషించారు.

ఆ నేపధ్యంలో 2004 ఎన్నికల్లో వైఎస్సార్ ముఖ్యమంత్రి అయితే ఉమ్మడి విశాఖ జిల్లా ఏకైక మంత్రిగా అయిదేళ్ళ పాటు కొణతాల హవా చలాయించారు. 2009లో కొణతాల ఓటమి పాలు కావడం, వైఎస్సార్ ఆకస్మిక మరణంతో జగన్ వైపు వచ్చారు. వైసీపీ ఆవిర్భావంలో చురుకైన పాత్ర పోషించిన కొణతాల 2014 ఎన్నికల్లో విశాఖ నుంచి వైఎస్ విజయమ్మ లోక్ సభకు పోటీ చేస్తే సరిగ్గా ఆమె విజయానికి పనిచేయలేదని జగన్ అనుమానించారు అంటారు.

అలా గ్యాప్ పెరిగి ఆయన వైసీపీ నుంచి బహిష్కరించబడ్డారు. 2014 నుంచి 2019 దాకా ఏ పార్టీలో చేరని ఆయన వైసీపీ వైపు మరోసారి వెళ్ళాలనుకున్నా కుదరలేదు. గత మూడేళ్ళుగా ఆయన రాజకీయంగా పెద్దగా కనిపించకపోయినా ఇపుడు సడెన్ ఎంట్రీ ఇచ్చారు. ఉత్తారాంధ్రా వేదిక పేరిట ఆయన ఒక స్వచ్చంద సంస్థ ద్వారా వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.

ఒక సదస్సు పెట్టి మరీ అన్ని పార్టీలను పిలిచి వైసీపీ సర్కార్ ని కడిగి పారేశారు. దాంతో కొణతాల 2024 ఎన్నికలకు రెడీ అవుతున్నారు అని అంతా భావిస్తున్నారు. ఆయన ఈసారి తెలుగుదేశం పార్టీని ఎంచుకునే పోటీ చేస్తారు అని అంటున్నారు. వైఎస్సార్ ఆశయ సాధనలో జగన్ సర్కార్ పూర్తిగా విఫలం అయింది అని కొణతాల చేస్తున్న విమర్శలు అన్నీ చూస్తే ఆయన  సైకిలెక్కెస్తారు అని అంటున్నారు.

ఆయన 2024 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తారు అని తెలుస్తోంది. ఆయన టీడీపీలో చేరి తన రాజకీయ సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేస్తారు అని అంటున్నారు. కొణతాల గతంలో అనేక సార్లు ఎంపీగా గెలిచారు. మంత్రిగా పనిచేశారు. బలమైన సామాజికవర్గానికి చెందిన ఆయన ఈసారి తెలుగుదేశం నుంచి పోటీ చేస్తే తన బలంతో పాటు ఆ పార్టీ శక్తి కూడా తోడు పార్లమెంట్ కి ఎన్నిక కావడం ఖాయమని అనుచరులు అంటున్నారు.

ఇక తెలుగుదేశం పార్టీకి చూస్తే అనకాపల్లి ఎంపీ సీటుకు సరైన క్యాండిడేట్ లేరు. దాంతో కొణతాలను చేర్చుకునేందుకు సుముఖంగా ఉంది అంటున్నారు. పైగా వైఎస్సార్ ఆప్తుడుగా ఉన్న కొణతాలను తమ వైపున ఉంచి జగన్ సర్కార్ మీద విమర్శలు చేయిస్తే అది జనంలోకి బాగా వెళ్తుంది అని తెలుగుదేశం భావిస్తోందిట. మొత్తానికి వైఎస్సార్ జగన్ వెంట ఉన్న కొణతాల చంద్రబాబు పార్టీలో చేరితే మాత్రం అది రాజకీయంగా ఒక సంచలనమే అవుతుంది అంటున్నారు.
Tags:    

Similar News