సీనియ‌ర్ల గేమ్‌.. కాంగ్రెస్‌లో సోనియా, రాహుల్ చాప్ట‌ర్ క్లోజ్‌?

Update: 2022-02-28 05:52 GMT
కేంద్రంలో బీజేపీని గ‌ద్దె దించి అధికారంలోకి రావాల‌ని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఇంటి పోరు చుక్క‌లు చూపిస్తోందని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఓవైపు ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు హోరాహోరీ జ‌రుగుతుండ‌గా మ‌రోవైపు ఆ పార్టీలోని సీనియ‌ర్లు `గాంధీ` కుటుంబాన్ని ఇర‌కాటంలో పడేసేలా వ్యూహాలు ర‌చిస్తున్నార‌ని అంటున్నారు. ఫలితాలు వెలువడిన అనంతరం కాంగ్రెస్‌ అధినాయకత్వంపై తిరుగుబాటుకు సీనియర్‌ నేతలు సంసిద్ధులవుతున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు గులాంనబీ ఆజాద్‌ ఇంట్లో పలువురు సీనియర్‌ నేతలు సమావేశమై ఇందుకు సంబంధించి వ్యూహరచన చేసినట్టు తెలిసింది.

ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాలు మార్చి 10న రాబోతున్నాయి. యూపీలో కాంగ్రెస్‌ అస్తిత్వమే ప్రమాదంలో పడబోతున్నదని వార్తలొస్తున్నాయి. పంజాబ్‌లో రెండోస్థానానికి పరిమితం కానున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. గోవా, ఉత్తరాఖండ్‌లో అవకాశాలే లేవంటున్నారు. మణిపూర్‌లో కొన్ని ఆశలున్నప్పటికీ.. ఇతర పార్టీలు ఏ మేరకు సహకరిస్తాయన్నది అనుమానమే. ఈ నేపథ్యంలో ఫలితాలు వెలువడిన అనంతరం కాంగ్రెస్‌ అధినాయకత్వంపై తిరుగుబాటుకు సీనియర్‌ నేతలు సంసిద్ధులవుతున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం.

సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు గులాంనబీ ఆజాద్‌ ఇంట్లో పలువురు సీనియర్‌ నేతలు సమావేశమై ఇందుకు సంబంధించి వ్యూహరచన చేసినట్టు తెలిసింది. గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి మాధవ్‌సింహ్‌ సోలంకీ కుమారుడు భరత్‌సింహ్‌ సోలంకీ, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌ చవాన్‌, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్‌సింగ్‌ హుడాతో పాటు సీనియర్‌ నేతలు కపిల్‌సిబల్‌, ఆనంద్‌శర్మ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నట్టు సమాచారం. వీరంతా 2020 ఆగస్టులో జీ23 పేరుతో కాంగ్రెస్‌ పార్టీలో సంస్థాగత మార్పులు కావాలంటూ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖాస్ర్తాన్ని సంధించినవారే కావ‌డం అస‌లు ట్విస్ట్‌.

ఇటీవలి కాలంలో రాహుల్‌గాంధీ క్రమంగా బలపడుతున్నారు.. పార్లమెంట్‌లో ప్రధానమంత్రిపైన, బీజేపీ నాయకత్వంపైన.. రాహుల్‌ విరుచుకుపడిన ప్రసంగం దేశమంతా వైరల్‌గా మారింది. కేంద్రంలోని బీజేపీ సర్కారుపైనా, ప్రధానమంత్రి మోడీపైన రాహుల్‌గాంధీ ఒక్కరే ఒంటరిగా దాడి చేస్తున్నారని, మిగిలిన సీనియర్‌ నాయకులంతా మౌనంగా ఉండిపోయారని విశ్లేషకులంటున్నారు. ఈ క్రమంలో సోనియా, రాహుల్‌ నాయకత్వాన్ని బలహీనపరచడం లక్ష్యంగా కాంగ్రెస్‌లోని సీనియర్ల సహాయాన్ని తీసుకొని బీజేపీ నాయకత్వమే పావులు కదుపుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

దీని ఫ‌లితంగానే, ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్‌లో నయా కాంగ్రెస్‌ పేరిట పెద్ద ఎత్తున దుమారం రేగబోతున్నదని విశ్వసనీయవర్గాల సమాచారం.
Tags:    

Similar News