సింగర్ సిద్ధూ హత్యకు మించిన సంచలనంగా మారిన రైఫిల్

Update: 2022-06-01 12:30 GMT
గాయకుడిగా సుపరిచితుడు.. వివాదాస్పద అంశాల్లో తల దూరుస్తూ తరచూ వార్తల్లో నిలవటం లాంటివి.. పంజాబ్ సింగర్ కమ్ కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలకు అలవాటే. అనూహ్యంగా ఆయన దారుణ హత్య ఆదివారం సాయంత్రం చోటు చేసుకోవటం తెలిసిందే. ఆయనకు కల్పించిన సెక్యురిటీని సగానికి తగ్గించిన తర్వాతి రోజే ఆయన మర్డర్ జరగటం ఒక సంచలనమైతే.. ఆయన పోస్టు మార్టం రిపోర్టు విస్మయానికి గురి చేసింది.

కేవలం క్షణాల్లోఆయనపై తూటాల వర్షాన్ని కురిపించి వెళ్లిపోయిన మూక వాడిన రైఫిల్ ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దాదాపు 45కు పైగా తూటాల్ని సిద్దూ బాడీలో నుంచి తీసినట్లుగా వైద్యులు వెల్లడించటం తెలిసిందే. క్షణాల వ్యవధిలో ఇంత పెద్ద ఎత్తున తూటాల్ని ఎలా కాల్చారు? అందుకు వినియోగించిన రైఫిల్ ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. తొలుత అనుకున్నట్లుగా ఆ రైఫిల్ ఏకే 47 కాదని తేలింది. హత్య జరిపిన ప్రదేశంలో పడిపోయిన ఖాళీ తూటా డొప్పల్ని పరిశీలించిన వారు విస్మయానికి గురవుతున్నారు.

ఎందుకంటే.. సిద్దూ హత్యకు ఏఎన్ 94 రైఫిల్ ను వినియోగించినట్లుగా గుర్తించారు. ఈ తరహా రైఫిల్ కేవలం రష్యా సైనికుల చేతుల్లోనే ఉంటాయి. అలాంటిది పంజాబ్ కు ఈ వెపెన్ రావటం ఏమిటన్నది ఇప్పుడు షాకింగ్ గా మారింది. రష్యా సాయుధ దళాలు మాత్రమే వినియోగించే ఈ రైఫిళ్లు.. ఐరిష్ రిపబ్లిక్ ఆర్మీ అనే వేర్పాటువాద దళం వద్ద కూడా ఉంటాయి. అలాంటి అత్యాధునిక ఆయుధం పంజాబ్ లో లభించటం.. దాన్ని ఒక ప్రముఖుడి హత్యకు వినియోగించటం చూస్తే.. అతడి హత్య వెనుక సాదాసీదా అంశాలు కాకుండా పెద్ద విషయం ఏదో ఉందన్న మాట వినిపిస్తోంది.

సిద్దూ హత్యకు వినియోగించిన రైఫిల్ ఏమిటన్న విషయంపై స్పష్టత వచ్చిన తర్వాత.. ఇప్పుడు అందరి చర్చ హత్య మీద కాకుండా.. అందుకు వినియోగించిన ఆయుధం గురించి మాట్లాడుకుంటున్నారు. రష్యాలో తయారయ్యే ఏఎన్ 94 రైఫిల్ డిజైన్ ను 1980లో మొదలు పెట్టి 1994లో పూర్తి చేశారు. ఏఎన్ అంటే.. అవోటోమాట్ నికొనోవ్ అన్నది అర్థం. ఈ రైఫిల్ కు చీఫ్ డిజైనర్ గెన్నాడి నికొనోవ్ పేరు వచ్చేలా పెట్టటం గమనార్హం.  

నికోనోవ్ ఎవరో కాదు.. మెషిన్ గన్ ను డిజైన్ చేసింది కూడా అతడే. ఏకే 94 రైఫిల్ ను ప్రస్తుతం రష్యా సైన్యం కొన్ని అవసరాలకు మాత్రమే వాడుతోంది. ఈ రైఫిల్ ప్రత్యేకత ఏమంటే.. నిమిషం వ్యవధిలో 600రౌండ్లను పేల్చగలదు. అటోమేటెడ్ మోడ్ లో ఉంచితే నిమిషంలో 1800 తూటాలు దూసుకొస్తాయి. అంతేకాదు.. ఈ రైఫిల్ నుంచి తూటా సెకనుకు 900 మీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని.. 700 మీటర్ల దూరంలోని టార్గెట్ ను చేధిస్తుందని చెబుతున్నారు. ఏకే 47 లో తూటా వేగం సెకన్ కు 715 మీటర్లుకాగా.. ఇది అంతకు మించిన అన్నమాట. ఇంతటి అత్యాధునిక ఆయుధాన్ని సిద్దూ హత్యకు వినియోగించటంతో భారత్ కు దీన్ని ఎలా తీసుకొచ్చారు? ప్రశ్నకు సమాధానాన్ని వెతుకుతున్నారు.
Tags:    

Similar News