వివేక హత్య కేసులో 15 మందిపై సునీత కున్న సందేహాలేమిటంటే?

Update: 2020-01-29 04:44 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి.. ఆయన కుమార్తె సునీత హైకోర్టు తలుపు తట్టటం.. సీబీఐ విచారణకు కోరటం.. ఆమె సమర్పించిన తాజా పిటిషన్ లో పదిహేను మంది పేర్లు ప్రస్తావించటం అనూహ్యంగా మారింది. తాను ప్రస్తావించిన పది హేను మందికి సంబంధించి ఆమె తనకున్న అనుమానాల్ని సదరు పిటిషన్ లో స్పష్టంగా పేర్కొన్నారు.

తాజాగా ఆమె దాఖలు పిటీషన్ సంచలనంగా మారటమే కాదు.. కొత్త అనుమానాల్ని తెర మీదకు తీసుకొచ్చినట్లుగా చెప్పొచ్చు. ఎందుకంటే.. వైఎస్ వివేక లాంటి వ్యక్తిని ఆయన ఊళ్లో.. ఆయన ఇంట్లోనే హతమార్చటం మామూలు విషయం కాదు. అదే సమయంలో.. ఆయన హత్యకు సంబంధించి తొలుత మీడియాలో వచ్చిన వార్తలకు.. ఆ తర్వాత వచ్చిన వార్తలకు పోలిక లేదు. హత్య అన్నది కన్ఫర్మ్ గా తెలిసిన తర్వాత కూడా.. అస్వస్థతో చనిపోయినట్లుగా కాసేపు.. బాత్రూంలో జారి పడినట్లుగా కొద్దిసేపు వార్తలు వచ్చి.. ఆ తర్వాత హత్య విషయం బయటకు రావటం అప్పట్లో ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. హత్య జరిగిన ఇన్ని రోజులు అవుతున్నా..ఇప్పటివరకూ హత్యకు కారణం ఏమిటన్న విషయంపై ఏ లెక్క తేలకపోవటంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటివేళలోనే వైఎస్ వివేక కుమార్తె హైకోర్టు తలుపు తట్టి.. తాను దాఖలు చేసిన పిటిషన్ లో తనకున్న అనుమానాల్ని సవివరంగా పేర్కొన్నారు. తాను అనుమానం వ్యక్తం చేసిన 15 మంది మీద ఆమె చేసిన ఆరోపణలు ఏమిటన్నది చూస్తే..

1. వాచ్‌ మన్‌ రంగయ్య

హత్య జరిగిన రోజున ఇతను మాత్రమే ఇంటి దగ్గర ఉన్నాడు. వివేకాను సజీవంగా ఉన్నప్పుడు చివరగా చూసింది ఇతడే. తాను నిద్రలో ఉండటంతో ఎలాంటి శబ్దాలు తనకు వినిపించలేదని చెబుతున్నాడు. గోద్రెజ్ షెల్ఫ్ స్టీల్ హ్యాండిల్ బద్ధలు కొట్టారు. ఆ శబ్ధం రంగయ్యకు వినిపించలేదా?

2. ఎర్ర గంగిరెడ్డి (వివేకాకు అత్యంత సన్నిహితుడు)

వివేకానందకు అత్యంత సన్నిహితుడు. ఇంటికి ఏడు గంటల సమయానికి వచ్చారు. మా కుటుంబానికి దగ్గరైనా ఫోన్ చేయలేదు. ఫోన్ చేసినా సమాధానం ఇవ్వలేదు

3. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి శివశంకర్‌ రెడ్డి

వైఎస్ భాస్కర్ రెడ్డి.. వైఎస్ అవినాష్ రెడ్డి.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలకు సన్నిహితుడు. నేర చరిత్ర ఉంది. వైఎస్ వివేకా స్థానంలో ఎమ్మెల్సీగా పోటీ చేయాలనుకున్నారు. వివేకా బతికి ఉన్న రోజుల్లో ఎప్పుడూ ఆయన ఇంటికి  వచ్చింది లేదు. హత్య జరిగిన వైనం వెలుగు చూసిన రోజున వివేకా బెడ్రూంలో ఉండి లోపలకు ఎవర్నీ రానివ్వలేదు. హత్య జరిగిన ప్రాంతాన్ని శుభ్రం చేయకుండా ఎవర్ని ఆపలేదు.

4.  ఉదయ్‌ కుమార్‌ రెడ్డి (వైఎస్‌ అవినాష్‌ రెడ్డి సన్నిహితుడు కమ్ యూసీఐఎల్ ఉద్యోగి)

ఎంపీ అవినాష్ రెడ్డికి.. శివశంకర్ రెడ్డికి సన్నిహితుడు. ఉదయ్.. ఈసీ సురేందర్ రెడ్డిని 14 మధ్య రాత్రి డి. శివశంకర్ రెడ్డిని కలిశారు.

5. పరమేశ్వర్‌ రెడ్డి

స్థానిక నాయకుడు. నేర చరిత్ర ఉంది. పలు కేసుల్లో నిందితుడు. హత్య జరిగిన రోజు తాను ఎక్కడో ఉన్నట్లుగా సాక్ష్యాలు చూపిస్తున్నారు. ఎక్కడో ఉన్నట్లు సాక్ష్యాలు చూపించాల్సిన అవసరం ఏముంది?

6. శ్రీనివాసరెడ్డి

పరమేశ్వర్ రెడ్డితో సంబంధాలు ఉన్నాయి. హత్యకు సంబంధించిన ఆధారాల్ని బయపెట్టనీయలేదు.

7. వైఎస్‌ అవినాష్‌ రెడ్డి తండ్రి భాస్కర్‌ రెడ్డి

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత భాస్కర్ రెడ్డి పేరును ముఖ్యమంత్రి పదవికి కాంగ్రెస్ అధిష్ఠానం ప్రతిపాదిస్తే.. వివేకానందరెడ్డి వ్యతిరేకించారు.

8. వైఎస్‌ మనోహర్‌ రెడ్డి (వైఎస్ అవినాష్ రెడ్డి బాబాయ్)

హత్య జరిగిన బాత్రూం.. బెడ్రూంలో రక్తపు మరకల్ని శుభ్రం చేయాలని మనోహర్ రెడ్డి చెప్పారని తమకు యర్ర గంగిరెడ్డి చెప్పినట్లు పోలీసులు చెప్పారు. మేం అతన్ని జైల్లో కలిసినా ఇదే విషయాన్ని చెప్పారు.

9. వైఎస్‌ అవినాష్‌ రెడ్డి (ఎంపీ)

హత్య జరిగిన ప్రాంతానికి ఉదయం ఆరు గంటలకే చేరుకున్న మొదటి కుటుంబ సభ్యుడు. గదులను శుభ్రం చేసేటప్పుడు అక్కడే ఉన్నాడు. శంకర్ ను అవినాష్ రెడ్డి రక్షించే ప్రయత్నం చేస్తున్నారన్నది మా నమ్మకం. కడప ఎంపీగా అధికారుల మీద ప్రభావం చూపించే వీలుంది.

10. సీఐ శంకరయ్య

హత్య జరిగిన రోజున ఇంటికి ఉదయం ఏడు గంటలకు చేరుకున్నారు. అనుమానాస్పద మరణం కింద కేసు నమోదు చేయాలని కోరితే.. శంకరయ్య మాత్రం సహజ మరణం అంటూ వాదనకు దిగారు. నా భర్త జోక్యంతో కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేయటానికి సీఐ ఎందుకు ఇష్టపడలేదు. వివేకాదు సహజ మరణం కాదని హిదయతుల్లా చెబితే.. పడిపోవటం వల్ల రక్తం చింది ఉండొచ్చని అతన్ని ఒప్పించే ప్రయత్నం చేశారు. కిరాతక హత్య అని చెప్పినా సీఐ మాత్రం ఆ వాదనను తిరస్కరించటం ఏమిటి?

11. ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి

అనుమానాస్పద వ్యక్తుల్లో ఒకరైన డి.శివశంకర్ రెడ్డికి మంచి స్నేహితుడు. సిట్ ఏర్పాటు అయ్యే వరకు దర్యాప్తు చేశారు. తర్వాత ఆయన్ను సాక్షిగా తీసుకున్నారు. దర్యాప్తు చేసిన వ్యక్తిని సాక్షిగా ఎలా తీసుకుంటారు?

12. ఈసీ సురేంద్రనాథ్‌ రెడ్డి

ఎంపీ అవినాష్ రెడ్డికి బంధువు. ఉదయ్ కు సన్నిహితుడు. ఆగస్టు 31న అవినాష్ రెడ్డి.. శివశంకర్ రెడ్డిలతో కలిసి డీజీపీని కలిశారు. తర్వాత విచారణ నెమ్మదించింది.

13. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి

హత్య జరిగినప్పుడు మంత్రిగా ఉన్నారు. వివేకాకు.. ఆదినారాయణ రెడ్డికి రాజకీయ వైరం ఉంది. పరమేశ్వరరెడ్డి మాజీ మంత్రి ఆదిని కలిసేవారు. వాళ్లు ఏమైనా పథకం వేశారా?

14. ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్‌ రెడ్డి (బీటెక్ రవి)

2016లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో శివశంకర్ రెడ్డి సాయంతో వివేకాపై గెలుపొందారు. హత్యతో గందరగోళానికి దారి తీసి.. వైఎస్సార్ కాంగ్రెస్ నేతల్ని అరెస్టు చేస్తారన్న అభిప్రాయం ఉండొచ్చు.

15. సురేందర్ రెడ్డి (పరమేశ్వరరెడ్డి బావమరిది)

ఆసుపత్రిలో ఉన్న సురేందర్ రెడ్డి ఫోన్ తీసుకొని ఉదయం 3.40 గంటల ప్రాంతంలో పరమేశ్వర్ రెడ్డికి ఏవో వివరాలు చూపించారు. అదే సమయంలో ఉదయ్ కుమార్ కూడా ఇల్లు వదిలి బయటకు వెల్లారు. హత్య పథకం పూర్తి అయినట్లుగా వారి భావించి వివరాలు చూసుకున్నారా?
Tags:    

Similar News