రఘురామ హత్యకు జార్ఖండ్ వాసులతో ప్లానింగ్?

Update: 2022-01-15 02:32 GMT
సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు. నిత్యం తాను ప్రాతినిధ్యం వహించే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పైనా.. ఆయన ప్రభుత్వంపై ఘాటు విమర్శలు.. సంచలన ఆరోపణలు చేసే ఆయన.. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. తనను చంపేసేందుకు భారీ కుట్ర పన్నుతున్నట్లుగా అందులో పేర్కొన్నారు. ఏపీ సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ నుంచి తనకు ప్రాణహాని ఉందని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కైన సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తన ప్రాణానికి హాని తలపెట్టారన్నారు. ''పీవీ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నడిచే అంబేడ్కర్ ఇండియా మిషన్ సంస్థతో రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో నాపై కేసులు నమోదు చేయించారు. ఈ కేసులకు సంబంధించిన విచారణకు పిలిచి.. నన్ను హత్య చేయాలని ప్రణాళిక రచించారు. ఇదే సునీల్ కుమార్ గత ఏడాది మే 14న తనను కస్టోడియల్ టార్చర్ కు గురి చేశారు. తర్వాత గుంటూరు జైలుకు పంపి.. అక్కడే హతమార్చాలని కుట్ర పన్నారు. అప్పుడు కుదరక.. ఇప్పుడు ఆ ప్రయత్నం చేస్తున్నారు'' అని ప్రధాని మోడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

తనను హత్య చేసేందుకు జార్ఖండ్ నుంచి 20 మంది వ్యక్తుల్ని రప్పించేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా ఆరోపించిన రఘురామ.. తాను ప్రధాని మోడీకి లేఖ ద్వారా దీనికి సంబంధించిన వివరాల్ని పేర్కొంటానని చెప్పారు. తనను హత్య చేసే కుట్రలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పాలు పంచుకున్నారన్నారు. అనంతరం ప్రధాని మోడీకి లేఖ రాశారు. జనవరి 14న మీడియాతో మాట్లాడిన సందర్భంలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలతో పాటు.. ఆరోపణలు చేశారు.

''ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కోపం వస్తే వ్యవస్థల్ని తీసేస్తారు. వ్యక్తులను లేకుండా చేస్తారు. తాజాగా టీడీపీ నేత చంద్రయ్య దారుణ హత్య దీనికి నిదర్శనం. ఇలా ఇంకెంతమందిని లేకుండా చేస్తారు. దీనికి ''సీఎం ఓం నమ:శివాయ స్కీం'' అని పేరు పెట్టుకుందాం'' అని వ్యాఖ్యానించారు. ఈ మధ్యన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్టు వ్యవహారంలో లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ స్పందించిన తీరును ప్రశంసించిన రఘురామ.. బండి సంజయ్ ఉదంతంపై లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ అప్పటికప్పుడు స్పందించిందన్నారు. తన వ్యవహారంలోనూ లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ స్పందించాలన్నారు.

గత ఏడాది తనను అరెస్టు చేసిన సందర్భంలో ఏపీ సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ .. మరో నలుగురు అధికారులు తన గదిలోకి దూరి తనకు దేహశుద్ధి చేశారని.. ఆ ఘటనపై విచారణ జరిపించాలని లోక్ సభ స్పీకర్ ను కోరిన వైనాన్ని గుర్తు చేవారు. గతంలో తాను ఇచ్చిన ప్రివిలేజ్ పిటిషన్ పై ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదన్నారు. ఈ వ్యవహారంపై ఎన్ఐఏ లేదంటే అదే స్థాయి సంస్థతో విచారణకు ఆదేశించాలని ప్రధాని మోడీని కోరారు. సంచలనంగా మారిన రఘురామ లేఖకు ప్రధాని మోడీ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.
Tags:    

Similar News