ఇటు వైపు జ‌గ‌న్ డిసైడ్‌.. అటు వైపు ఎవ‌రు...!

Update: 2022-01-02 01:30 GMT
ఏపీలో గ‌త ఐదేళ్ల చంద్ర‌బాబు పాల‌న‌ను ప్ర‌జ‌లు పూర్తిగా తిర‌స్క‌రించార‌ని ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి విమ‌ర్శించారు. న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు చెప్పిన ఆయ‌న శ‌నివారం మీడియాతో మాట్లాడారు. టీడీపీ పాల‌న‌ను ఛీత్క‌రించిన ప్ర‌జ‌లు కొత్త ఆశ‌ల‌తోనే సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిని అధికారంలోకి తీసుకువ‌చ్చార‌ని ఆయ‌న చెప్పారు.

30మే 2019లో అధికారం చేపట్టిన వైసీపీ ప్ర‌భుత్వం 2020, 2021 సంవత్సరాలను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుందని పేర్కొన్నారు. 2020లో ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌ను నాశ‌నం చేసిందని.. అప్ప‌టికే టీడీపీ ప్ర‌భుత్వం చేసిన అప్పుకు తోడు క‌రోనా కూడా రావ‌డంతో రాష్ట్రం రుణ‌భారంతో మ‌రింత‌గా కుంగిపోయింద‌ని స‌జ్జ‌ల చెప్పారు.

ఎన్ని స‌వాళ్లు ఎదురైనా కూడా సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి మాత్రం మేనిఫెస్టోలో తాను ఇచ్చిన 95 శాతం హామీల‌ను పూర్తి చేసిన‌ట్టు స‌జ్జ‌ల చెప్పారు. ఏ ప‌థ‌కంలో కూడా అంత‌రాయం లేకుండా పూర్తి చేస్తున్నార‌ని కూడా స‌జ్జ‌ల కితాబు ఇచ్చారు. జ‌గ‌న్ ఏపీలో అమ‌లు చేస్తోన్న ప‌థ‌కాలు ఏ మాత్రం సామాన్య‌మైన‌వి కావ‌న్న స‌జ్జ‌ల‌.. గ్రామ స‌చివాల‌యాలు, వ‌లంటీర్ వ్య‌వ‌స్థ అనేవి ఇప్పుడు జ‌న‌జీవనంలో భాగ‌మైయ్యాయ‌న్నారు.

ఇక ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీపై ఆయ‌న సెటైర్లు వేశారు. ఏపీలో అధికార ప‌క్షాన్ని ఢీకొట్టే శ‌క్తి తెలుగుదేశంకు లేద‌న్నారు. ఇటు వైపు సీఎం జ‌గ‌న్ ఉన్నార‌ని.. అటు వైపు ఎవ‌రు ఉన్నార‌ని స‌జ్జ‌ల ప్ర‌శ్నించారు. ప్ర‌జ‌ల్లో ఉన్న సంతోషాలే త‌మ పార్టీని గెలిపిస్తాయ‌న్న ఆయ‌న‌.. ఏపీలో పోరాటాలు చేసేందుకు ప్ర‌తిప‌క్షాల‌కు స్కోప్ లేకపోవడంతో జిన్నా ట‌వ‌ర్‌, కింగ్‌జార్జ్ ఆసుప‌త్రి పేరు చెప్పుకుని రాజ‌కీయాలు చేస్తున్నాయ‌ని మండిప‌డ్డారు.


Tags:    

Similar News