మహిళా ఎంపీలపై లైంగిక వేధింపులు!

Update: 2016-10-26 22:30 GMT
లైంగిక వేదింపుల బారిన పడుతున్న విద్యార్థినులు - బాలికలు - మహిళల గురించి నిత్యం ఏదో ఒక మూల జరిగిన సంఘటనలు వింటూనే ఉంటాం. ప్రపంచంలో ఏదో ఒక మూల నిత్యం మహిళలపై వేధింపులు జరుగుతూనే ఉన్నాయనేది జగమెరిగిన సత్యం. ఈ విషయంపై రకరకాల చట్టాలు - కొత్త కొత్త శిక్షలు ఎన్ని వస్తున్నా ఈ పరిస్థితి నుంచి మహిళలు మాత్రం తప్పించుకోలేకపోతున్నారు. అలా అని ఈ మహిళల్లో మామూలు ఉద్యోగినులు - గృహిణులు - కళాశాలలకు వెళ్లే అమ్మాయిలే ఉంటారనుకుంటే పొరపాటే... ఈ లిస్ట్ లో మహిళా ఎంపీలు కూడా ఉన్నారని తాజా సర్వే చెబుతోంది.

బాధ్యతాయుత పదవుల్లో ఉండి కూడా కొందరు తోటి మహిళా నేతలనూ వేధిస్తున్నారని, ఎంపీలుగా ఉన్న మహిళలకు కూడా వేదింపులు తప్పడం లేదనే వాస్తవం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ (ఐపీయూ) ప్రపంచవ్యాప్తంగా ఉన్న పార్లమెంట్ ల్లోని 55 మంది మహిళా ఎంపీలను ఇంటర్వూ చేసింది. ఈ ఇంటర్వూ లో ఆ మహిళా ఎంపీలు చెప్పిన విషయాలను బట్టి చూస్తే... సుమారు 80శాతానికిపైగా మహిళా నేతలు మానసిక, లైంగిక వేధింపులు లేదా హింసను ఎదుర్కొన్నారట. ఇదే క్రమంలో చంపేస్తామన్న బెదిరింపులతో పాటూ కిడ్నాప్, అత్యాచారం చేస్తామనో లేక వారి వారి కుటుంబసభ్యులు, పిల్లలను అపహరిస్తామనో వార్నింగులు ఎదుర్కొంటున్నవారు 40శాతం మంది ఉన్నారట.

39 దేశాలకు చెందిన 55 మంది ఎంపీల నుంచి అభిప్రాయాలు సేకరించింది ఐపీయూ. ఈ విషయాలపై బ్రిటన్ లేబర్ పార్టీకి చెందిన ఎంపీ జెస్ ఫిలిప్ కు అయితే ఆమెను రేప్ చేస్తామంటూ ఒక రాత్రిలో 600 మెసేజ్ లు వచ్చాయని చెబుతున్నారట. వీటిపై స్పందిచిన వారిలో.. రాజకీయాల్లో మహిళా నేతలపై సాగుతున్న హింసను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ కు ఈ సర్వే తోడ్పడుతుందని యూనియన్ సెక్రటరీ జనరల్ మార్టిన్ చుంగాంగ్ చెబుతున్నారు. ఈ వేదింపుల సంగతి ఒకెత్తు అయితే... తోటి నాయకులు అశ్లీల చిత్రాలు చూపుతూ పెడార్ధాలు వచ్చేలా తమతో మాట్లడారాని 65.5 శాతం మంది మహిళా ఎంపీలు పేర్కొన్నారు.

బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన నేతలే ఇలా వంకర బుద్ధులు ప్రదర్శిస్తూ మహిళా నేతలనూ హింసించడంపై ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ ఆందోళన వ్యక్తంచేస్తోంది. మహిళా నేతలపై వేధింపుల పర్వం ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అని అభిప్రాయపడుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News