రాజ‌కీయ స‌న్యాసానికి కాలుదువ్విన ష‌బ్బీర్

Update: 2018-02-09 05:51 GMT
దూకుడు అన్ని స‌మ‌యాల్లో ప‌నికి రాద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోతున్నారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేత‌లు.  త‌మ‌ది కాని టైంలో ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడితే లాభం కంటే న‌ష్ట‌మే ఎక్కువ జ‌రుగుతుంద‌న్న విష‌యాన్ని వారు మ‌ర్చిపోతున్నారు. వంద‌కు పైగా సీట్లు త‌మ‌కు వ‌స్తాయ‌న్న తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ అన్న‌ట్లుగా ఈ మ‌ధ్య‌న కాంగ్రెస్ నేత‌లు ఎవ‌రికి వారు త‌మ‌కు వ‌చ్చే సీట్ల గురించి లెక్క‌లు చెబుతున్నారు.

అయితే.. వీరి లెక్క‌ల‌న్నీ నేత‌ల్ని బ‌ట్టి ఉంటోంది. ఓప‌క్క ఉత్త‌మ్ లాంటోడు.. పార్టీకి 70 సీట్లు ప‌క్కా అంటుంటే.. మ‌రోవైపు మాజీ మంత్రి.. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ష‌బ్బీర్ అలీ మాత్రం త‌మ‌కు వంద సీట్లు ప‌క్కా అని చెబుతున్నారు. ఒక్కో నేత ఒక్కోలా మాట్లాడ‌టం కాంగ్రెస్ నేత‌ల్లో క‌నిపిస్తుంటే.. కేసీఆర్ అండ్ కో మాత్రం అందుకు భిన్నంగా ఒక్క‌మాట మీదే నిల‌బ‌డ‌టం క‌నిపిస్తోంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌ర్ త‌మ‌కే సొంత‌మ‌ని చెబుతున్న కాంగ్రెస్ నేత‌లు.. ఆ ధీమాను అలానే కొన‌సాగించటం త‌ప్పేం కాదు. కానీ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒక‌రేమో70 సీట్లు అంటే.. మ‌రొక‌రు 100 సీట్ల‌కు పైనే త‌మ‌కు వ‌స్తాయ‌ని చెప్ప‌టంపైనే అభ్యంత‌ర‌మంతా.

ష‌బ్బీర్ మాట‌ల్నే తీసుకుంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ‌లో 100 సీట్లు ప‌క్కాన‌ని.. ఒక‌వేళ అలాంటిది జ‌ర‌గ‌కుంటే మాత్రం తాను రాజ‌కీయ స‌న్యాసం చేయ‌నున్న‌ట్లు స‌వాలు విసిరారు. కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డిన నేప‌థ్యంలో.. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై ష‌బ్బీర్ మండిప‌డ్డారు.

మంత్రి కేటీఆర్ మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలే కానీ.. అస‌భ్య ప‌ద‌జాలంతో ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడ‌టం మంచిది కాద‌న్నారు. కేటీఆర్ మాట‌ల్లో త‌ప్పులు వెతికే ష‌బ్బీర్‌.. తాను విసిరిన స‌వాల్ విష‌యంలో మ‌రోసారి ఆలోచించి ఉంటే బాగుండేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ష‌బ్బీర్ తాజా స‌వాలు చూస్తే.. రాజ‌కీయాల నుంచి రిటైర్ కావాల‌న్న‌ట్లుగా ఆయ‌న వ్యాఖ్య ఉంద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. ఉత్త‌మ్ నోటి నుంచి వ‌చ్చిన 70 సీట్ల ముచ్చ‌టే.. ఎలా సాధ్య‌మ‌ని కిందా మీదా ప‌డుతుంటే.. ఇది స‌రిపోద‌న్న‌ట్లుగా ష‌బ్బీర్ తాజాగా సీట్ల సంఖ్య‌ను 100కు పెంచ‌టం గ‌మ‌నార్హం.

సీట్ల సంఖ్య‌తో పాటు.. దిమ్మ తిరిగేలా భారీ స‌వాలు విసిరిన వైనం చూస్తే.. ష‌బ్బీర్ కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని చెబుతున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కు వందకు పైగా సీట్లు ఎలా సాధ్య‌మో చెప్పాల‌ని స‌వాలు విసురుతున్న వారికి ష‌బ్బీర్ ఎలాంటి బ‌దులు ఇస్తార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఏమైనా ష‌బ్బీర్ తాజా స‌వాలు మాత్రం ఆయ‌న్ను రాజ‌కీయ స‌న్యాసం దిశ‌గా న‌డిపిస్తున్నాయ‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.


Tags:    

Similar News