సీబీఐ డైరెక్ట‌ర్ ర‌చ్చ‌...ష‌బ్బీర్ అలీ పాత్రేంటి?

Update: 2018-10-23 07:42 GMT
అవినీతిపరులకు సింహ స్వప్నంగా ఉండాల్సిన సీబీఐకే అవినీతి చీడపట్టి - ఇద్దరు అత్యున్నత అధికారుల మధ్య అంతర్గతపోరు రచ్చకెక్కిన సంగ‌తి తెలిసిందే. మాంసం ఎగుమతిదారు మొయిన్ ఖురేషీ హవాలా కేసును దర్యాప్తు చేస్తున్న దేవేందర్ కుమార్ ఈ కేసులో సహ నిందితునిగా ఉన్న సతీశ్ సానా వాంగ్మూలాన్ని ఫోర్జరీ చేసినట్టు ఆరోపించింది. సీబీఐ డైరెక్టర్ అలోక్‌ వర్మకు అవినీతిని అంటగట్టే విధంగా ఆ వాంగ్మూలాన్ని ఫోర్జరీ చేసినట్టు సీబీఐ భావిస్తున్నది. దేశ‌వ్యాప్తంగానే కాకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా కూడా భార‌త ద‌ర్యాప్తు సంస్థ‌ల‌పై ఈ ఎపిసోడ్ క‌ల‌క‌లం సృష్టించింది. అయితే, ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ ఎపిసోడ్ మూలాలు రాష్ట్రంలో ఉన్న‌ట్లుగా ప‌లు ప‌రిణామాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. అదే స‌మ‌యంలో....ఇందులో ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ నేత ప్ర‌మేయం ఉండ‌టం సంచ‌ల‌నంగా మారింది.

అయితే,  ఇలా సంచ‌ల‌న కేసులు బయటపడుతున్న క్రమంలో అకస్మాత్తుగా రాష్ట్ర కాంగ్రెస్‌ కు చెందిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ పేరు తెరపైకి వచ్చింది. మాంసం ఎగుమతి వ్యాపారి అయిన హవాలా బ్రోకర్ మొయిన్ ఖురేషీపై నమోదైన సిబిఐ కేసులో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ పేరు జాతీయ మీడియాలో చర్చకు వేదికగా మారింది. ఒక సిబిఐ కేసులో హైదరాబాద్ నగల వ్యాపారి సుఖేష్ గుప్తా బెయిల్ కోసం సిబిఐ మాజీ డైరెక్టర్లు రంజిత్ సిన్హా - ఏపి సింగ్‌ లకు షబ్బీర్ అలీ రూ. 1.75 కోట్ల మేర ఖురేషీ ద్వారా ముడుపులు చెల్లించినట్లు 24 గంటల ఇంగ్లీషు వార్తా ఛానెల్ ‘టైమ్స్ నౌ’ సోమవారం ఒక చర్చ ప్రసారం చేసింది. ఇప్పటివరకు అటు సిబిఐగానీ ఇటు ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్‌ గానీ ఎందుకు షబ్బీర్ ఆలీని ప్రశ్నించలేదని ఆ ఛానెల్ మోడరేటర్ - రిపోర్టర్ నడుమ చర్చ జరిగింది. సిబిఐ కేసు నుంచి నగల వ్యాపారి సుఖేష్ గుప్తాను తప్పించేందుకు మొయిన్ ఖురేషీ ద్వారా సిబిఐ మాజీ డైరెక్టర్లు రంజన్ సిన్హా - ఏపి సింగ్‌ లకు మాజీ మంత్రి షబ్బీర్ అలీ ముడుపులు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి.

రంజిత్ సిన్హా కోసం హవాలా డీలర్ మెయిన్ ఖురేషీ లంచాలు వసూలు చేసిన వ్యవహారంలో షబ్బీర్ అలీ ప్రమేయం కూడా ఉందని, రూ. 1.75 కోట్ల మేర లంచం ఇచ్చి తన పనులు చేయించుకున్నాడని ఈడీ తన చార్జిషీట్‌ లో పేర్కొన్నట్లు టైమ్స్ నౌ ఛానెల్ ప్రస్తావించింది. కానీ ఛార్జిషీట్‌ లో తన పేరును ఈడీ పెట్టినట్లు ఇప్పటివరకు తనకు తెలియదని, ఆ సంస్థ నుంచి తనకు ఎలా నోటీసు కూడా అందలేదని షబ్బీర్ ఆలీ సమర్ధించుకున్నారు. బొగ్గు కుంభకోణం కేసుకు సంబంధించి నిందితులతోనూ - సిబిఐ అధికారులతోనూ ఉన్న సంబంధాల్లో భాగంగా మొయిన్ ఖురేషీని ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఖురేషీ బ్లాక్‌ బెర్రీ ఫోన్‌ ను కూడా డీకోడ్ చేసి షబ్బీర్ ఆలీతో ఉన్న సంబంధాలకు సంబంధించిన ఆధారాలను సేకరించారు. వాటి ప్రకారమే హైదరాబాద్‌ కు చెందిన నగల వ్యాపారి సుఖేష్ గుప్తా కోసం షబ్బీర్ ఆలీ రూ. 1.75 కోట్ల మేర లంచాన్ని ఖురేషీ ద్వారా హవాలా మార్గంలో సమకూర్చినట్లు వార్త‌లు వెలుగులోకి వ‌చ్చాయి.


Tags:    

Similar News