షారూక్‌.. తిట్లు.. సారీలు.. కొత్త ద‌న్ను!

Update: 2015-11-04 16:14 GMT
దేశంలో మ‌త స‌హ‌నం త‌గ్గిపోతుంద‌ని.. అస‌హ‌నం పెరిగిపోతుందంటూ చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై బాలీవుడ్ బాద్షా షారూక్‌ ఖాన్ వ్యాఖ్య‌లు చేయ‌టం.. ఆయ‌న‌పై వీహెచ్‌పీ.. బీజేపీ నేత‌లు విరుచుకుప‌డ‌టం తెలిసిందే. తాజాగా షారూక్ వ్య‌వ‌హారంపై ప‌లు ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. దేశంలో పెరుగుతున్న అస‌హ‌నం కార‌ణంగా అవ‌స‌ర‌మైతే త‌న‌కిచ్చిన పుర‌స్కారాల్ని సైతం వెన‌క్కి ఇచ్చేందుకు ఆలోచించ‌నంటూ చేసిన వ్యాఖ్య‌ల‌తో మొద‌లైన ర‌చ్చ మ‌రింత ముదిరింది. అయితే.. ఈ వివాదానికి సంబంధించి బుధ‌వారం చాలానే ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి.

షారూక్ పై ఘాటు విమ‌ర్శ‌లు చేసిన బీజేపీ నేత కైలాశ్ విజ‌య్ వ‌ర్గియా త‌న మాట‌ల్ని వెన‌క్కి తీసుకోవ‌టం ఒక ప‌రిణామంగా చెప్పొచ్చు. షారూక్ మ‌న‌సు పాక్ లో ఉందంటూ తాను చేసిన వ్యాఖ్య‌ల్ని త‌ప్పుగా అర్థం చేసుకున్నారంటూ వ్యాఖ్యానించిన ఆయ‌న త‌న వ్యాఖ్య‌ల్ని వెన‌క్కి తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇదే స‌మ‌యంలో.. షారూక్ పై మ‌రో బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత మంట‌లు రేపాయి.

బీజేపీ ఎంపీ అదిత్య‌నాథ్ మాట్లాడుతూ.. షారూక్ ఖాన్ ను పాక్ ఉగ్ర‌వాద సంస్థ జ‌మాత్ ఉద్ ద‌వా చీఫ్ హ‌ఫీజ్ స‌యూద్ తో పోల్చారు. అత్య‌ధికులు (మెజార్టీ వ‌ర్గీయులు) కానీ షారూక్ సినిమాలు కానీ చూడ‌కుంటే ఆయ‌న రోడ్డు మీద ఉండేవారు కాదా? అని ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. దేశంలో అస‌హ‌నం ఉంటే షారూక్ సినిమాల్ని చూసేవారా? అంటూ వ్యాఖ్యానించారు.

ఇలా షారూక్ మీద బీజేపీ.. వీహెచ్ పీ నేత‌ల దాడి జ‌రుగుతుంటే.. అనూహ్యంగా ఆయ‌న‌కు శివ‌సేన నుంచి మ‌ద్ద‌తు ల‌భించింది.  ఒక ముస్లిం అయినందుకు షారుక్ ఖాన్ పై తీవ్ర విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లు చేయ‌టం స‌రికాదంటూ శివ‌సేన ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. షారూక్ వ్యాఖ్య‌ల‌పై బీజేపీ ఒక‌ర‌కంగా.. శివ‌సేన మ‌రోర‌కంగా స్పందించ‌టం గ‌మ‌నార్హం. ఈ వ్య‌వ‌హారం ఎంతవ‌ర‌కు ముదురుతుంద‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.
Tags:    

Similar News