టీటీడీ చైర్మన్ నియామకం టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శలపాల్జేస్తోంది. టీటీడీ చైర్మన్ గా కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ ను నియమించిన సంగతి తెలిసిందే. ఆయన మతంపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అన్యమతస్థుడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా గుంటూరు జిల్లా తాళ్లాయపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి కూడా ఈ నియామకంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హిందు దేవాలయ పరిరక్షణను దెబ్బ తీయడం కోసమే పుట్టా సుధాకర్ యాదవ్ ను టీటీడీ బోర్డు చైర్మన్ గా నియమించారంటూ ఆయన ఆరోపించారు.
కాగా పుట్టా సుధాకర్ యాదవ్ ఇటు ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు - అటు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఇద్దరికీ వియ్యంకుడు. మైదుకూరు నుంచి టీడీపీ టిక్కెట్ ఆశిస్తున్నారాయన. అయితే.. అక్కడ మాజీ మంత్రి డీఎల్ రవీంద్రరెడ్డిని టీడీపీలోకి తెచ్చి టిక్కెట్ ఇవ్వాలన్నది చంద్రబాబు ఆలోచన. ఈ క్రమంలోనే సుధాకర్ యాదవ్ కు ఈ పదవి ఇచ్చి ఎమ్మెల్యే టిక్కెట్ రవీంద్రారెడ్డికి ఇవ్వడం కోసం ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా చంద్రబాబు టీటీడీ ఛైర్మన్ పదవి కట్టబెట్టారన్న విమర్శలున్నాయి.
అయితే శివస్వామి.. సుధాకర్ యాదవ్ నియామకాన్ని వ్యతిరేకిస్తున్నందున ఆయన పీఠాధిపతిగా ఉన్న తాళ్లాయపాలెం శైవక్షేత్రాన్ని ముట్టడించేందుకు యాదవులు ప్లాన్ చేస్తున్నారంటూ శివస్వామి ఆరోపిస్తున్నారు. ఆదివారం యాదవులు ముట్టడించనున్నట్లు తనకు సమాచారం ఉందని శివస్వామి అంటున్నారు. పోలీసులుకు ఫిర్యాదు చేస్తానంటున్నారాయన. సుధాకర్ యాదవ్‌కు బదులు హిందూధర్మం పాటించే ఏ ఇతర యాదవ సోదరుడిని నియమించినా తనకు అభ్యంతరం లేదని శివస్వామి అంటున్నారు.