ఆమె దగ్గు దెబ్బకు పక్కటెముకలు విరిగిపోయాయి

Update: 2022-12-08 02:01 GMT
కొంతమంది కొన్నిసార్లు దగ్గుతుంటే.. ఏమైపోతుందో అన్న భయం కలుగుతుంది. దేన్నైనా భరించొచ్చు కానీ దగ్గును మాత్రం భరించటం కష్టమంటూ కొందరు వాపోతుంటారు. ఇలాంటి దగ్గుకు సంబంధించి తాజాగా వెలుగు చూసిన ఒక ఉదంతం గురించి తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది.

నిజంగానే అలా జరిగిందా? అన్న సందేహం కలుగక మానదు. కానీ.. స్కానింగ్ రిపోర్టులు కళ్ల ముందు ఉండటంతో విపరీతమైన ఆశ్చర్యానికి గురి కాక తప్పదు. చైనాకు చెందిన ఒక మహిళ దగ్గి దగ్గి.. పక్కటెమకలు విరిగిపోయిన అరుదైన ఉదంతం బయటకు వచ్చింది.

స్పైసీ ఫుడ్ తిన్న చైనాలోని షాంఘై నగరానికి చెందిన ఒక మహిళకు అనూహ్య పరిణామం ఎదురైంది. ఆహారం తిన్న తర్వాత ఆమెకు దగ్గు మొదలైంది. చూస్తుండగానే పెరిగి పెద్దదైంది. గుక్క తిప్పుకోనివ్వకుండా వచ్చి పడుతున్న దగ్గుతో ఆమె కిందా మీదా పడిపోయారు. తీవ్రంగా దగ్గుతున్న ఆమెకు చాతీలో ఏదో కదిలిన శబ్దం వచ్చింది. ఏదో విరిగినట్లుగా అనిపించింది. అయినా.. దగ్గు తీవ్రత కారణంగా ఆ విషయాల్ని ఆమె పెద్దగా పట్టించుకోలేదు.

కట్ చేస్తే.. దగ్గు తగ్గిన తర్వాత నుంచి ఆమెకు ఛాతీలో నొప్పి మొదలైంది. మొదట్లో దీన్ని లైట్ తీసుకున్నా.. తర్వాతి కాలంలో నొప్పి పెరగటంతో ఆమె ఆసుపత్రికి వెళ్లారు. విషయం మొత్తం తెలుసుకున్న వైద్యులు ఆమెకు సిటీ స్కాన్ తీశారు. ఆ రిపోర్టును పరిశీలించినప్పుడు వారో విస్మయానికి గురి చేసే అంశాన్ని గుర్తించారు. దగ్గు తీవ్రత కారణంగా ఆమె పక్కటెముకలు విరిగినట్లుగా గుర్తించారు. దీంతో ఆమెకు బ్యాండేజీలు వేసి.. చికిత్స చేసతున్నారు.

ఎంత పెద్ద దగ్గు అయితే మాత్రం అలా పక్కటెముకలు విరిగిపోతాయా? అన్న సందేహం కలగొచ్చు. ఈ ఉదంతంలో సదరు మహిళ బలహీనంగా ఉండటం.. బాగా సన్నగా ఉండటంతో ఇలాంటి పరిస్థితి ఎదురైనట్లుగా వైద్యులు చెబుతున్నారు.

విరిగిన ఎముక గాయాల నుంచి కోలుకునేందుకు ఆమెకు మందులు వాడుతున్నారు. ఒకసారి సెట్ అయ్యాక.. కండరాల్ని మరింత శక్తివంతం చేయటానికి అవసరమైన అన్ని ప్రయత్నాల్ని చేస్తామని చెబుతున్నారు. ఏమైనా.. దగ్గే కదా? అని లైట్ తీసుకోవద్దు. ఇలాంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే వీలుందన్నది మర్చిపోకూడదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News