తెలంగాణ - ఆంధ్రా ఇష్యూ పై జగన్ తో మాట్లాడుతా అన్న షర్మిల!

Update: 2021-03-09 11:46 GMT
అన్నను ఎదురించి.. చెల్లెలు షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చిందంటారు. కానీ ఇప్పుడు జగన్ తోనే ఆమె సంప్రదింపులు జరపాల్సి వస్తే.. తెలంగాణలోని ప్రజల కోసం అన్న సాయం కోరాల్సి వస్తే చేస్తుందా? లేదా అన్నది హాట్ టాపిక్ . కానీ తెలంగాణ సమస్యలపై అన్న, ఏపీ సీఎం జగన్ తో మాట్లాడుతానని వైఎస్ షర్మిల అనడం చర్చనీయాంశమైంది.

తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్ర ప్రాంత హోంగార్డులు మంగళవారం లోటస్ పాండ్ లో వైఎస్ షర్మిలను కలిశారు. తమను తెలంగాణ నుంచి ఏపీలో విధుల్లోకి తీసుకునే విధంగా జగన్ ప్రభుత్వంతో మాట్లాడాలంటూ షర్మిలకు వారు విన్నవించారు. తెలంగాణలో పనిచేస్తున్నా ఇప్పటికీ తమను స్థానికేతరులుగానే గుర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర విభజన సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్లుగా తమకు ఆప్షన్లు ఇవ్వలేదని.. అందువల్ల ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చిందని షర్మిల వద్ద హోంగార్డులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.ఈ క్రమంలోనే తమను స్థానికేతరులుగా ఇక్కడ ఉంచవద్దని.. తమను ఆంధ్రాలో విధుల్లోకి తీసుకునేలా సీఎం జగన్ తో మాట్లాడాలని షర్మిలకు విజ్ఞప్తి చేశారు.

ఈ క్రమంలోనే హోంగార్డుల విన్నపంపై షర్మిల సానుకూలంగా స్పందించారు. హోంగార్డుల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.  దీంతో అన్నయ్య తో సమస్యలపై చర్చించేందుకు తనకు ఎటువంటి అభ్యంతరాలు లేవని షర్మిల చాటిచెప్పినట్టైంది. మరీ మాట వినకుండా రాజకీయాల్లోకి వచ్చిన  చెల్లెలు కోరికను అన్నయ్య జగన్ నెరవేరుస్తాడా? లేదా అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న..
Tags:    

Similar News