సెల్ఫీ దిగారు సరే.. నోరు ఊరుకోదే.. ట్వీట్ చేసి సారీ చెప్పిన థరూర్

Update: 2021-11-30 07:30 GMT
రంగం ఏదైనా మేధావులకు ఉండే ఇమేజ్ అంతా ఇంతా కాదు. అందుకు రాజకీయ రంగం కూడా మినహాయింపు కాదు. రాజకీయ రంగం అన్నంతనే.. కొన్ని క్వాలిటీస్ ఉంటే సరిపోతుంది.. మేధావితనంతో అవసరం లేదన్న భావన చాలామందిలో ఉంటుంది. అయితే.. ప్రజాదరణ అంతంత మాత్రంగా ఉంటూ.. మేధావిగా మంచి పేరున్న కొందరు రాజకీయ నేతలు ఉంటారు. వ్యక్తిగతంగా చూస్తే.. కాసిన్ని డాట్స్ తో కనిపించే కాంగ్రెస్ సీనియర్ నేత కమ్ తిరువనంతపురం లోక్ సభ సభ్యుడు శశిథరూర్ కు పొలిటీషియన్ కంటే కూడా ఇంటలెక్చువల్ గానే గుర్తింపు ఎక్కువ.

అలాంటి ఆయన ప్రతి సందర్భంలోనూ ఏదో ఒక వివాదంలో శశిథరూర్ పేరు వినిపిస్తూ ఉంటుంది. తాజాగా ఆయన వ్యాఖ్యపై ఘాటు విమర్శలు.. తిట్ల దండకాలు అందుకోవాల్సి వచ్చింది. చివరకు అయ్యాగారు కాస్తంత తగ్గి.. చెంపలేసుకొని.. సారీ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ ఆయన చేసిన తప్పు ఏమైనా ఉందంటే.. శశిథరూర్ లోని కొంటెతనమే. రాజకీయ నేతగా.. కీలకమైన పదవిలో ఉండి హుందాగా వ్యవహరించాల్సిన ఆయన.. కాలేజీ కుర్రాడి మాదిరిగా స్పందిస్తే ఇలాంటి చిక్కుల్లో పడకుండా ఉంటారా?
తాజాగా మెదలైన పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో మహిళా ఎంపీలుగా ఉన్న సుప్రియా సూలే.. ప్రణీత్ కౌర్.. తమిజాచి తంగపండియన్.. మిమి చక్రవర్తి.. నస్రత్ సహాన్.. జ్యోతిమణిలతో కలిసి ఎంపీ శశిథరూర్ సెల్ఫీ దిగారు.

వారితో సెల్ఫీ దిగిన అనంతరం..వారి కోరిక మేరకు తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ఇంతవరకు అంతా బాగున్న వేళ.. శశిథరూర్ లోని కొంటె మనిషి నిద్ర లేచారు. పని చేసేందుకు లోక్ సభ ఆకర్షణీయమైన స్థలం కాదని ఎవరు చెప్పారంటూ తనదైన శైలిలో కాసింత కళాపోషణను ప్రదర్శించారు. దీనిపై పలువురు నెటిజన్లురియాక్టు అయ్యారు. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఇష్యూను.. సెక్సిజమ్ వైపునకు మళ్లించి.. గౌరవమైన ఎంపీగా వ్యవహరిస్తూ.. ఇదేం పోయే కాలమని మండిపడ్డారు. మహిళా ఎంపీల్ని ఆకర్షణీయమైన వస్తువులుగా మారుస్తూ.. పార్లమెంటులో.. రాజకీయాల్లో వారు చేస్తున్న కృషిని తక్కువ చేస్తారా? అంటూ పలువురు ఫైర్ అయ్యారు. పార్లమెంటులో మహిళల్ని కించపర్చొద్దంటూ జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ ట్వీట్ చేశారు.

తాను చేసిన పోస్టు రచ్చ రచ్చగా మారిన విషయాన్ని గుర్తించిన ఆయన నష్టనివారణ ప్రయత్నాల్ని షురూ చేశారు. తన ఫోటో వ్యాఖ్యతో బాధ పడిన వారికి సారీ చెప్పిన ఆయన సెల్ఫీ తీసుకోవాలన్న ఆలోచన మహిళా ఎంపీలదేనని ఆయన వివరణ ఇచ్చారు. వారే.. తనను సోషల్ మీడియాలో పోస్టు చేయాలన్నారని చెప్పటం ద్వారా తనలో తప్పుడు ఆలోచనలు ఏమీ లేవన్న విషయాన్ని స్పష్టం చేసే ప్రయత్నం చేశారు.

అంతేకాదు.. తాను ఇచ్చిన క్యాప్షన్ ను కాస్తంత మార్చిన ఆయన.. ‘‘పని ప్రదేశంలో ఇలాంటి స్నేహపూర్వకం ప్రదర్శనలో పాల్గొనటం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది’ అని పేర్కొనటం ద్వారా.. తనపై రేగిన ఆగ్రహా జ్వాలల్ని తగ్గించే ప్రయత్నం చేశారు. ఇదంతా చూసినప్పుడు అపూర్వమైన మేధోతనాన్ని ప్రదర్శించే శశిథరూర్.. తాను రాజకీయ రంగంలో ఉన్నానని.. దానికంటూ ఒక ఇమేజ్ ఉందని.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే జరిగే రచ్చను ఆయన గుర్తించకపోవటం ఏమిటో?
Tags:    

Similar News