క‌రోనా కేర్ నుంచి పారిపోవాల‌ని.. కిటికీలో ఇరుక్కుపోయింది..!

Update: 2021-03-17 15:30 GMT
క‌రోనా పాజిటివ్ రావ‌డంతో.. కొవిడ్ కేర్ సెంట‌ర్లో చేర్చారు. అక్క‌డి ప‌రిస్థితులు న‌చ్చ‌లేదో.. ఇంటికి దూరంగా ఉండ‌లేక‌పోయిందో గానీ.. ఆ సెంట‌ర్ నుంచి త‌ప్పించుకోవాల‌ని నిర్ణ‌యించుకుంది ఓ యువ‌తి. ఎప్పుడు పారిపోవాలి? ఎక్క‌న్నుంచి పోవాలి? అని లెక్క‌లు వేసుకుంది. అంద‌రూ నిద్ర‌పోయిన త‌ర్వాత అర్ధ‌రాత్రి వేళ మెల్ల‌గా బెడ్ మీద నుంచి లేచింది. తాను పారిపోవాల‌నుకున్న మార్గం వ‌ర‌కు వ‌చ్చింది.

ఆ మార్గం ఓ కిటికీ. సినిమాల్లో మాదిరిగా క‌నిపించే కిటికీ కాదు. మ‌న ఇళ్ల‌ల్లో క‌డ్డీల‌తో ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర‌గా ఉండే కిటికీ అది. అందులోంచి దూరిపోగ‌ల‌న‌ని ఎలా భావించిందో గానీ.. ప్ర‌య‌త్నం మొద‌లు పెట్టింది. ముందుగా కాళ్లు రెండు కిటీ రాడ్ల‌లోంచి బ‌య‌ట పెట్టింది. ఆ త‌ర్వాత న‌డుము భాగం వ‌ద్దకు రాగానే సందు స‌రిపోలేదు. దీంతో.. బ‌లంగా ప్ర‌య‌త్నించిన‌ట్టుంది మొత్తంగా ఇరుక్కుపోయింది.

ఇక బ‌య‌ట‌కు వెళ్ల‌డం సాధ్యం కాలేదు.. తిరిగి లోనికి వెళ్ల‌డం కూడా కుద‌ర‌లేదు. చాలా సేపు తీవ్రంగా ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ విఫ‌ల‌మైపోయింది. అటూ ఇటూ గింజుకున్నా ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. ఈ క్ర‌మంలో అందులో ఇరుక్కొని తీవ్ర అవ‌స్థ‌లు ప‌డింది. చివ‌ర‌కు త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో గ‌ట్టిగా కేక‌లు వేసింది. నిద్రిస్తున్న వారంతా లేచి వ‌చ్చి షాక్ అయ్యారు.

ఆ త‌ర్వాత ప‌రిస్థితిని అర్థం చేసుకొని బ‌య‌ట‌కు తీసేందుకు య‌త్నించినా సాధ్యం కాలేదు. రాడ్ల‌ను క‌ట్ చేయాల‌ని చూసినా కుద‌ర్లేదు. దీంతో.. అనివార్యంగా ఫైర్ సిబ్బందికి కాల్ చేశారు. వాళ్లు వ‌చ్చి గ్యాస్ క‌ట్ట‌ర్ తో రాడ్ల‌ను క‌ట్ చేసి ఆమెను బ‌య‌ట‌కు తీశారు. ఈ ఘ‌ట‌న పుణెలోని ఎరండ్వేన్ కేర్ సెంట‌ర్లో మార్చి 15వ తేదీన చోటు చేసుకుంది.
Tags:    

Similar News