జిన్నాను ఆమె అంత‌లా పొగిడేసిందే

Update: 2017-06-09 05:28 GMT
కొంత‌మంది చెప్పే విష‌యాలు చాలా సిత్రంగా.. కొత్త‌గా అనిపిస్తుంటాయి. ఒక వ్య‌క్తి ఎంత మంచివాడైనా.. దేశ విభ‌జ‌న‌కు కారణ‌మ‌య్యాడ‌న్న ఒక్క కార‌ణం చాలు క‌దా అత‌న్ని ద్వేషించ‌టానికి. మ‌తం ఆధారంగా చీలిక తీసుకొచ్చి దేశాన్ని రెండు ముక్క‌లు చేయ‌ట‌మే కాదు.. దాయాది పోరును ర‌గిల్చిన వైనాన్ని ఏ భార‌తీయుడు మాత్రం మ‌ర్చిపోగ‌ల‌రు. త‌న మూర్ఖత్వంతో.. మొండిత‌నంతో.. యుద్ధ‌కాంక్ష‌తో ప్ర‌పంచం మొత్తాన్ని ప్ర‌భావితం చేయ‌ట‌మే కాదు.. రెండు ప్ర‌పంచ యుద్ధాల‌కు కార‌ణ‌మైన హిట్ల‌ర్‌ ని ద్వేషిస్తామే కానీ.. అత‌డిలోని సున్నిత‌త్వాన్ని ప‌దే ప‌దే చెప్పుకుంటూ త‌న్మ‌య‌త్వం చెంద‌లేం క‌దా.

తాజాగా పాక్ జాతిపిత మ‌హ్మ‌దాలీ జిన్నా మీద పుస్త‌కం రాసిన ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ షీలారెడ్డి మాట‌లు కూడా ఇదే రీతిలో ఉన్నాయి. జిన్నాను విల‌న్‌ గా చూడొద్ద‌ని ఆమె చెబుతున్నారు. జిన్నా మీద పుస్త‌కం రాసిన ఆమె.. ఆ పుస్త‌కాన్ని తాజాగా విడుద‌ల చేశారు. ఇందుకు సంబంధించిన కార్య‌క్ర‌మం ఒక‌టి ఏర్పాటు చేశారు. మిస్ట‌ర్ అండ్ మిసిస్‌ జిన్నా పేరుతో రాసిన ఈ పుస్తకం గురించి.. జిన్నా గురించి మాట్లాడిన షీలారెడ్డి.. జిన్నా గురించి ప్ర‌పంచానికి తెలియ‌ని చాలా విష‌యాల్ని తానీ పుస్త‌కం ద్వారా వెల్ల‌డించిన‌ట్లుగా చెప్పుకున్నారు. జిన్నా గొప్ప‌త‌నాన్ని.. జిన్నా స‌తీమ‌ణికి సంబంధించిన ఆస‌క్తిక‌ర అంశాల్ని తాను రాసిన‌ట్లు చెప్పారు.

జిన్నాకు సంబంధించిన ఎన్నో విష‌యాల్ని తాను పాక్‌కు వెళ్లి తెలుసుకోవ‌టంతో పాటు.. ఆయ‌న‌కు సంబంధించిన ప‌లు లేఖ‌ల ఆధారంగా పుస్త‌కం రాసిన‌ట్లుగా చెప్పారు. పేరుకు ముస్లిం అయిన‌ప్ప‌టికీ పార్శీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న జిన్నాకు సంబంధించి చాలా విష‌యాల్ని ప్ర‌పంచం తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు. ప్ర‌తి మ‌నిషిలోనూ మంచి.. చెడు రెండూ ఉంటాయి.

ఎంత‌టి దుర్మార్గుడైన‌ప్ప‌టికీ.. అత‌న్ని అభిమానించే వారూ.. ప్రేమించే వారూ ఉంటార‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. కోట్లాది మంది ప్రాణాలు పోవ‌టానికి కార‌ణ‌మైన నియంత హిట్ల‌ర్ ను అభిమానించే వారూ ఉంటారు. అంత మాత్రాన హిట్ల‌ర్‌ను నెత్తిన పెట్టుకోగ‌ల‌మా? ఎంత పుస్త‌కం రాస్తే మాత్రం.. జిన్నా రాత్రికి రాత్రి మంచోడు అయిపోడు క‌దా? బుక్‌ను ప్ర‌మోట్ చేసుకోవ‌టం త‌ప్పు కాదు.. కానీ.. జిన్నా లాంటి  దేశ‌ద్రోహిని (భార‌తీయుడి దృష్టి కోణంలో చూసిన‌ప్పుడు) హీరోగా అభివ‌ర్ణించ‌టం లాంటివే అభ్యంత‌ర‌క‌రం. అలాంటివి దేశానికి.. దేశ స‌మ‌గ్ర‌త‌కు అంత క్షేమ‌క‌రం కావ‌న్న విష‌యాన్ని గుర్తిస్తే మంచిది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News