రాహుల్.. ప్రియాంక.. షీలా.. ఇంకెవరు?

Update: 2016-06-17 09:23 GMT
ఒక పెద్ద రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి అనుకుందాం. ఆ రాష్ట్రానికి ఒక జాతీయ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తుంది? అన్న ఆసక్తి  అందరిలో ఉంటుంది. కానీ.. రెండు వారాలకోసారి చొప్పున ఒక్కో పేరును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆలోచిస్తున్నట్లుగా వార్తలు రావటం ఏమిటి? అన్నది ఒక ప్రశ్న. ఒక్కోసారి ఒక్కో పేరును తెరపైకి రావటం.. ఆ అంశం మీద పార్టీలో చర్చ జరుగుతున్నట్లుగా కథనాలు రావటం వెనుక అసలు కథ ఏమైనా ఉందా? అంటే ఉందనే చెప్పాలి.

ఇదంతా ఏ రాష్ట్రం గురించి.. ఏ రాజకీయ పార్టీ గురించో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలోనే అతి పెద్దదైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం విషయంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న వ్యూహంగా దీన్ని చెప్పాలి. తాను టేకప్ చేసే ఏ రాష్ట్రమైనా.. ఏ పార్టీ అయినా విజయతీరాలకు చేర్చటమే పనిగా పట్టుకునే వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరిట ఈ మధ్యన వార్తలు తరచూ వస్తున్నాయి.

వాస్తవానికి యూపీలో కాంగ్రెస్ బలం ఎంతన్నది అందరికి తెలిసిందే. అలాంటి రాష్ట్రంలో కాంగ్రెస్ ను గెలుపుబాట పట్టించే దిశగా ప్రయత్నించటం అంత తేలికైన విషయం కాదు.  మరి అలాంటి రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు సంగతి తర్వాత.. ఆ రాష్ట్రంలో ఏదో జరుగుతుందన్న భావన కలిగేలా చేయటంలో ప్రశాంత్ కిషోర్  సక్సెస్ అవుతున్నారనే చెప్పాలి. గడిచిన కొద్ది నెలలుగా యపీ ఏన్నికలకు సంబంధించి మరే ఇతర పార్టీకి సంబంధించి రానన్ని వార్తలు కాంగ్రెస్ పార్టీ గురించి రావటం.. అది కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి గురించి రావటం గమనార్హం.

కాంగ్రెస్ పార్టీకి రేపో..మాపో అధ్యక్షుడిగా ఎన్నిక కానున్న రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థి అన్న విషయం తెలిసినా.. ఆయన్ను యూపీ సీఎం పదవికి నామినేట్ చేసే విషయం మీద పార్టీలో చర్చ జరిగినట్లుగా తొలుత వార్తలు వచ్చాయి. ఆ సర్ ప్రైజ్ నుంచి తేరుకోకముందే.. ప్రియాంకగాంధీ పేరు వచ్చింది. అది సాధ్యమయ్యే విషయమేనా? అన్న సందేహాల్లో నుంచి బయటకు రాకముందే.. తాజాగా  ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ పేరు వినపడటం ఆసక్తికరంగా చెప్పాలి.

నిజానికి ఈ పేర్లు అన్ని ఇలా బయటకు రావటం.. జాతీయ మీడియాలో ప్రాధాన్యత కలిగే వార్తాంశంగా మారటం అంతా ప్రశాంత్ పుణ్యమేనని చెప్పాలి. అభ్యర్థి పేరు బయటకు వచ్చిన ప్రతిసారి ఒక వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లుగా వస్తున్న కథనాలు చూస్తే అర్థమయ్యేది ఒక్కటే.. యూపీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏదో ఒక అంశం వార్తలుగా మీడియాలో కనిపించటం.. అందరి దృష్టిని ఆకర్షించేలా చేయటంగా చెప్పాలి. కావలంటే.. చురుగ్గా కదల్లేక.. వయోభారంతో తనదైన ప్రభావాన్ని ప్రదర్శించలేని షీలాదీక్షిత్ యూపీ ఎన్నికల్లో ఎంత మేర ప్రభావం చూపించగలరు? అయినా.. ఆమె పేరు బయటకు వచ్చిందంటే.. రానున్న రోజుల్లో అలాంటి మరిన్ని పేర్లు రానున్నాయన్న మాటేనని చెప్పక తప్పదు.
Tags:    

Similar News