ప‌రిష్కారం దిశ‌గా బాబ్రీ వివాదం?

Update: 2017-11-21 10:00 GMT
దేశంలో రెండు ప్ర‌ధాన వ‌ర్గాల మ‌ధ్య ద‌శాబ్దాలుగా సాగుతున్న స‌మ‌స్య ప‌రిష్కారం దిశ‌గా జ‌రుగుతున్న చ‌ర్చ‌ల్లో మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. హిందూ- ముస్లిం వర్గాల మ‌ధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం దీర్ఘకాలికంగా సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ వివాదం ఆరు దశాబ్దాలనాటిదని కొందరు చెబితే... మరికొందరు మాత్రం 1885 నాటిదని అంటున్నారు. ఫైజాబాదు సివిల్ కోర్టులో దాఖలైన వ్యాజ్యాలను ఆరాతీస్తే ఈ విషయం వెల్లడవుతోంది. అయితే, 1992 డిసెంబరు ఆరో తేదీన బీజేపీ అగ్ర‌నేత‌ల‌ సమక్షంలో కరసేవకులు బాబ్రీ మసీదును నేలకూల్చారు. మసీదుపై కాషాయ జెండాలు ఎగురవేశారు. ఈ చర్య దేశంలో తీవ్ర ఉద్రిక్తతలు - మతకలహాలకు దారితీసింది.

అనంత‌రం చాలాసార్లు ఈ వివాదం ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. అయితే ఈ ఏడాది మార్చిలో అయోధ్యలోని వివాదాస్పద రామ జన్మభూమి– బాబ్రీ మసీదు స్థల వివాదం పరిష్కారం కోసం సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. మతంతో పాటు సున్నితమైన భావోద్వేగాలు కేసుతో ముడిపడినందున చర్చల ద్వారా పరిష్కరించుకోవడం ఉత్తమమని కోర్టు అభిప్రాయపడింది. ఈ నేప‌థ్యంలో అయోధ్య‌లో రామ‌మందిరం వివాదంపై ప‌రిష్కారం దిశ‌గా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో ప‌రిష్కారం దిశ‌గా మ‌రో కీల‌క అడుగు పడింది.

అయోధ్యలోని వివాదాస్పద బాబ్రీ మసీదు స్థలంపై తమ హక్కును పూర్తిగా వదులుకోవడానికి సిద్ధమనీ.. అందుకు ప్రతిగా లక్నోలో మసీదు నిర్మించాలని  ఉత్తరప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టులో దరఖాస్తు చేసింది. పరిష్కారాన్ని కోరుతూ షియా వక్ఫ్ బోర్డు - హిందూ సంస్థలు ప్ర‌స్తుతం ఒకే అభిప్రాయానికి వ‌చ్చాయ‌ని షియా బోర్డ్ చైర్మన్ సయీద్ వసీం రిజ్వి వెల్ల‌డించారు. ఈ విష‌యంపై త‌దుప‌రి నిర్ణయం తీసుకోవాల్సింది సుప్రీంకోర్టేన‌ని చెప్పారు. ఈ విషయాన్ని గత శనివారమే సుప్రీంకోర్టుకు లిఖితపూర్వకంగా తెలిపినట్లు వసీం రిజ్వీ చెప్పారు. ఈ వివాదాన్ని పరిష్కరించుకోడానికి ఇదే అత్యుత్తమ మార్గమనీ, లక్నోలోని హుసేనాబాద్‌ లో ఎకరా స్థలంలో రాష్ట్రప్రభుత్వం మసీదును నిర్మించాలని కోరారు.

అయితే ఈ ప్రతిపాదనను సున్నీ వక్ఫ్‌ బోర్డు - ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు నిర్ద్వంద్వంగా తిరస్కరించాయి. హక్కును వదులుకుంటామని షియా వక్ఫ్‌బోర్డు చెబుతోందనీ - బాబ్రీ మసీదు స్థలంపై దానికి అసలు హక్కు ఎక్కడుందని సున్నీ వక్ఫ్‌ బోర్డు ప్రశ్నించింది. ఏది ఏమైనా ద‌శాబ్దాల స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దిశ‌గా సాగుతున్న ప్ర‌య‌త్నాలు విజ‌య‌వంత‌మ‌య్యే అవ‌కాశాలు క‌న‌బ‌డుతున్నాయ‌ని ఇరు వ‌ర్గాలకు చెందిన విశ్లేష‌కులు ఆశాభావం వ్య‌క్తంచేశారు.
Tags:    

Similar News