మోడీపై ‘మిస్సైల్’ను ఎక్కు పెట్టిన శివసేన

Update: 2017-02-07 15:25 GMT
చేతులారా చేసుకునే దానికి ఎవరూ ఏమీ అనలేరు. రాజకీయాల్లో రాజీ అత్యవసరం. కాస్త పట్టువిడుపులతో వ్యవహరించాల్సిందే. ఇలాంటి వాటి విషయంలో ప్రధాని మోడీ తీరు కాస్త భిన్నంగా ఉంటుంది. కమలనాథులకు చిరకాల మిత్రుడైన శివసేన విషయంలో మోడీ పరివారం వ్యవహరించిన తీరుపై కమలనాథులు సైతం కాస్తంత గుర్రుగా ఉంటారు. వారి విషయంలో మోడీ కటువుగా వ్యవహరించారన్న వాదన వినిపిస్తుంటుంది.

అదును చూసి తమను దెబ్బేసిన మోడీపై శివసేన కారాలు.. మిరియాలు నూరుతూనే సరైన సమయం.. సందర్భం కోసం ఎదురుచూస్తున్న వైనం కనిపిస్తుంది. తనను రాజకీయంగా దెబ్బ తీసేందుకు ఏ మాత్రం వెనుకాడని మోడీకి షాకిచ్చేందుకు ప్రయత్నిస్తున్న శివసేన.. తాజాగా అందుకు తగ్గట్లుగా పక్కా ప్లాన్ ఒకటి సిద్ధం చేసుకున్నట్లుగా ఉంది. గుజరాత్ లోని బీజేపీ సర్కారుకు ముచ్చెమటలు పట్టే నిర్ణయాన్ని ప్రకటించింది.

పటేళ్లకు రిజర్వేషన్ల డిమాండ్ తో కొన్ని నెలల క్రితం హార్దిక్ పటేల్ నిర్వహించిన ఉద్యమం గుజరాత్ ప్రభుత్వాన్నే కాదు.. మోడీ సర్కారుపై ఎంతటి ప్రభావాన్ని చూపించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆటంబాంబు హార్దిక్ ను తమ పార్టీలో చేర్చుకున్నట్లు ప్రకటించిన శివసేన.. రానున్న గుజరాత్ ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేస్తారని ప్రకటించింది.

ఈ ఏడాది ద్వితీయార్థంలో గుజరాత్అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. మోడీ నేతృత్వంలో తిరుగులేని విజయాల్ని సాధిస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న కమలనాథులపై గుజారాతీయుల్లో అసంతృప్తి పెల్లుబుకుతుందన్న మాట వినిపిస్తున్న వేళ.. హార్దిక్ ను రంగంలోకి దిగిన శివసేన నిర్ణయం మోడీ పరివారానికి మంట పుట్టించటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. కేంద్రంలో మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న శివసేన.. మరోవైపు చప్పుడు చేయకుండా ఇస్తున్న షాకులు కమలనాథులకు కొత్త కలవరంగా మారుతుందనటంలో సందేహం లేదు. గుజరాత్ బీజేపీపై హార్దిక్ ను సంధిస్తున్న శివసేన నిర్ణయం మోడీకి షాక్ గా మారటం ఖాయమనే చెప్పాలి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News