బుల్లెట్ రైలుతో మోదీ ఇలా దొరికిపోయారే!

Update: 2017-09-15 13:17 GMT
భార‌త్‌ను జ‌పాన్‌ను చేయాల‌ని అనుకున్నారో ఏమో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ.. ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం చ‌ర్చ‌కు కూడా రాని ఓ విష‌యాన్ని వెలుగులోకి తేవ‌డం, అంత‌లోనే దానికి ప్రారంభోత్స‌వాలు నిర్వ‌హించ‌డం కూడా జ‌రిగిపోయాయి. అదే బుల్లెట్ రైలు! అది కూడా ఆయ‌న త‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్‌లోనే ఏర్పాటు చేసుకుంటున్నారు. అహ్మ‌దాబాద్ నుంచి మ‌హారాష్ట్ర‌లోని ముంబై వ‌ర‌కు బుల్లెట్ ట్రైన్‌ను ఏర్ప‌రిచే ప‌నిలో భాగంగా ఆయ‌న అమ్మ‌దాబాద్‌లో రెండు రోజుల కింద‌ట జ‌పాన్ ప్ర‌ధాని జింసో అబేతో క‌లిసి శంకుస్థాప‌న కూడా చేసేశారు. ఇంత వ‌ర‌కు బాగ‌నే ఉంది. అయితే, బుల్లెట్ ట్రైన్ రాకుముందే.. మోదీకి బుల్లెట్ల వంటి విమ‌ర్శ‌లు త‌గులుతున్నాయి.

ఇప్ప‌టికే నెటిజన్లందరు మోదీపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. దేశంలో ఇప్ప‌టికే ఉన్న రైల్వేల‌ను లైన్‌ లో పెట్టండి మ‌హాప్ర‌భో మాకెందుకు ఈ బుల్లెట్ ట్రైన్లు అని కామెంట్ల‌తో కుమ్మేశారు. మ‌రి కొంద‌రు ఇంకో అడుగు ముందుకేసి.. దేశంలో ఉన్న రైల్వేని బాగు చేయండి, వాటిని స‌మ‌యానికి స‌క్ర‌మంగా తిప్పండి అవేమాకు చాలు అని హాట్ కామెంట్ల‌తో ఇర‌గ‌దీశారు. అయినా మోదీ వీటిని ప‌ట్టించుకున్న‌ట్టు లేదు. ఇక‌, ఈ విమ‌ర్శ‌ల బుల్లెట్ల ప‌రంపర అక్క‌డితో ఆగిపోలేదు. మోదీకి మిత్ర‌ప‌క్షం శివ‌సేన కూడా తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డింది.

ముంబై- అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుపై శివసేన తీవ్ర విమర్శలు గుప్పించింది. పార్టీ అధికార ప‌త్రిక‌ సామ్నాలో ప్రధాని మోదీని, బీజేపీని విమర్శిస్తూ కథనాన్ని రాసుకొచ్చింది. బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును ఒక అనవసరమైన ప్రాజెక్టుగా సామ్నా అభివర్ణించింది. ‘భారతీయ రైల్వే - ముంబై లోకల్‌ ట్రైన్లు ప్రతీరోజు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో బుల్లెట్‌ రైలు అనవసరం. ఇది సామాన్యుల కోసం చేపట్టిన ప్రాజెక్టు కాదు సంపన్న, బిజినెస్‌ క్లాస్‌ వారి కోసం నిర్మిస్తున్నారు` అని విరుచుకుప‌డింది.

``రుణాలు మాఫీ చేయమని రైతులు వేడుకుంటుంటే పట్టించుకోకుండా బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెడుతోంది. దీని వల్ల రైతులు తమ జీవనాధారాన్ని కోల్పోతున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.1.08లక్షల కోట్లు వెచ్చిస్తోంది. 30 వేల కోట్లు రాష్టం ఇవ్వనుంది. కార్మికులతో సహా కావాల్సిన వనరులన్నీ జపాన్‌ ఇస్తుంది. నిధులు, స్థలం మాత్రం మహారాష్ట్ర, గుజరాత్‌ ప్రభుత్వాలు ఇస్తున్నాయి. ఘనత మాత్రం జపాన్‌కు వెళ్తుంది. దీని ద్వారా మనల్ని దోచుకుంటున్నారు’ అంటూ సామ్నా తన సంపాద‌కీయంలో నిప్పులు చెరిగింది. మొత్తంగా బుల్లెట్ ట్రైన్ క‌న్నా ముందే మోదీ .. బుల్లెట్ల క‌న్నా తీవ్రంగా ఉన్న విమ‌ర్శ‌ల‌ను మాత్రం ఎదుర్కొనాల్సి వ‌స్తోంది.
Tags:    

Similar News