మ‌హా స‌ర్కారుకు శివ‌సేన క‌టీఫ్ చెప్పేస్తుందా?

Update: 2017-09-19 07:17 GMT
మ‌హారాష్ట్ర‌లో బీజేపీతో క‌లిసి అధికారాన్ని పంచుకుంటున్న‌శివ‌సేన త్వ‌ర‌లో ప్ర‌భుత్వానికి మ‌ద్దతు ఉప‌సంహ‌రించ‌నుందా.. అంటే అవున‌ని ఆ పార్టీ వ‌ర్గాల నుంచే వినిపిస్తోంది. వాస్త‌వానికి 2014 అక్టోబ‌ర్‌ లో గెలిచాక రెండు పార్టీలు క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశాయి. నాటి నుంచి రెండు పార్టీల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. ఆ ఎన్నిక‌ల్లో సొంతంగా గెలిచి ఎవ‌రి మ‌ద్ద‌తూ అవ‌స‌రం లేకుండా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని దివంగ‌త బాల్ ఠాక్రే కుమారుడు ఉద్ద‌వ్ ఠాక్రే నేతృత్వంలోని శివ‌సేన భావించింది. అయితే మోదీ ప్ర‌భంజ‌నంలో దేవేంధ్ర ఫ‌డ్న‌వీస్ నాయ‌క‌త్వంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) 122 సీట్ల‌తో అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించింది.

నాటి ఎన్నిక‌ల్లో మొత్తం 288 సీట్లు ఉన్న మ‌హారాష్ట్ర అసెంబ్లీలో శివ‌సేన కేవ‌లం 63 సీట్ల‌కే ప‌రిమిత‌మైంది. ఆ రాష్ట్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి 145 మంది ఎమ్మెల్యేల అవ‌స‌రం. ప్ర‌భుత్వ ఏర్పాటుకు మ‌ద్ద‌తివ్వ‌కుండా శివ‌సేన బెట్టు చేయ‌డంతో శ‌ర‌ద్ ప‌వార్ నేతృత్వంలోని నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌ సీపీ) బీజేపీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌డానికి స్నేహ‌హ‌స్తం చాపింది. బీజేపీ-ఎన్‌ సీపీ క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తే త‌మ ప్ర‌యోజ‌నాలు దెబ్బ‌తింటాయ‌ని భావించిన శివ‌సేన బెట్టువీడి ప్ర‌భుత్వంలో చేరింది. త‌ద్వారా కొన్నిమంత్రి ప‌దవుల‌ను ద‌క్కించుకుంది. మ‌రో ప‌క్క కేంద్ర ప్ర‌భుత్వంలోని బీజేపీ ప్ర‌భుత్వంలోనూ చేరింది.

కేంద్రంలో త‌న అవ‌స‌రం బీజేపీకి లేక‌పోవ‌డంతో రాష్ట్రంలో ప్ర‌తి చిన్న‌విష‌యానికి బీజేపీతో క‌య్యానికి కాలు దువ్వుతోంది. కేంద్రంలో కావాల్సిన‌న‌న్ని కేబినెట్ బెర్తులు ద‌క్కించుకోలేక‌పోయామ‌నే బాధ‌తోపాటు రాష్ట్రంలో బీజేపీ త‌మ‌కంటే ఎక్కువ సీట్లు సాధించ‌డంపై గుర్రుగా ఉంది. అంతేకాకుండా నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు రైల్వే శాఖా మంత్రిగా ప‌నిచేసి ప్ర‌స్తుతం కేంద్ర వాణిజ్య - ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న‌ సురేశ్ ప్ర‌భు ముందు శివ‌సేన నుంచి లోక్‌ స‌భ ఎంపీగా గెలిచారు. త‌ర్వాత ఆయ‌న‌తో రాజీనామా చేయించి కేంద్ర కేబినెట్‌ గా మంత్రిగా మోడీ నియ‌మించుకోవ‌డం శివ‌సేన‌కు కంట‌గింపుగా మారింది. త‌మ‌ను సంప్ర‌దించ‌కుండా త‌మ పార్టీ ఎంపీని ఆ పార్టీలో చేర్చుకోవ‌డంతోపాటు కీల‌క‌మైన రైల్వే శాఖ‌ను కేటాయించ‌డంతో ర‌గిలిపోయింది. దీంతో అవ‌కాశ‌మున్న‌ప్ర‌తిసారీ కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఏమీ అన‌లేక రాష్ట్ర ప్ర‌భుత్వంపై నింద‌లేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే మ‌హారాష్ట్ర స‌ర్కారుకు త్వ‌ర‌లోనే క‌టీఫ్ చెబుతానంటూ వార్నింగ్‌ లిస్తోంది.
Tags:    

Similar News