శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్యకు కేంద్రం షాకిచ్చిందా?

Update: 2020-12-28 15:59 GMT
బీజేపీతో విడిపోయి మహారాష్ట్రలో ప్రత్యర్థులతో కలిసి అధికారం చేపట్టింది శివసేన పార్టీ. అయితే శివసేన తరుఫున ఎప్పుడూ బీజేపీని టార్గెట్ చేస్తుంటాడు ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్. బీజేపీ అంటేనే చాలు ఒంటికాలిపై సంజయ్ రౌత్ లేస్తుంటాడు.

అలాంటి సంజయ్ రౌత్ భార్య తాజాగా పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో చిక్కుకున్నారు.దీంతో బీజేపీ ఊరుకుంటుందా? ఊరుకోదు కదా.. అందుకే చర్యలు మొదలుపెట్టింది?

శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్ష రౌత్ కు కేంద్రంలోని ఈడీ సమన్లు జారీ చేసింది. ప్రత్యర్థులపై సీబీఐ, ఈడీలనే బీజేపీ ప్రయోగిస్తుంటుంది. ఇప్పుడూ అదే జరిగిందన్న గుసగుసలు ముంబై రాజకీయ వర్గాల్లో సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల 29 న వర్ష రౌత్ ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. లోగడ రెండుసార్లు వీటిని పంపినా ఆరోగ్య కారణాలు చూపి ఈడీ ఎదుటకు రాకుండా ఆమె గైర్హాజరయ్యారు. ఈసారి ఆమెకు సమన్లు పంపడం ఇది మూడోసారి. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం కింద వర్ష రౌత్ ని విచారించనున్నారు.

ఈ బ్యాంకు నుంచి కొన్ని నిధులు మళ్లించారని.. ఈ నిధుల్లో కొంత ఆమె అందుకున్నారని ఆరోపణలు వచ్చాయి. బ్యాంకు ప్రమోటర్లపై కూడా కేసులు నమోదయ్యాయి. దాదాపు రూ.4335 కోట్ల నష్టాలు వాటిల్లాయి. దీంతో సంజయ్ రౌత్ భార్యకు కేంద్రంలోని బీజేపీ ఈడీ ద్వారా ఉచ్చు బిగిసేలా చేస్తోందన్న ప్రచారం మహారాష్ట్రలో సాగుతోంది.




Tags:    

Similar News