టీడీపీకి షాక్‌.. జనసేనలోకి కీలక నేత!

Update: 2022-11-23 10:34 GMT
కాకినాడ జిల్లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ ఆ పార్టీకి షాకివ్వబోతున్నారా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. వర్మ జనసేన పార్టీలో చేరబోతున్నారని టాక్‌ నడుస్తోంది. ఇప్పటికే ఆయన జనసేనాని పవన్‌ కల్యాణ్‌ను హైదరాబాద్‌లో కలిసి పార్టీలో చేరతానని చెప్పారని అంటున్నారు. ఈ విషయాన్ని వర్మ అత్యంత సన్నిహిత వర్గాలు మీడియాకు తెలిపాయని సమాచారం.

కాగా వర్మకు పిఠాపురంలో మంచి గుర్తింపు ఉంది. 2014లో చంద్రబాబు టికెట్‌ నిరాకరించడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరి చంద్రబాబుకు బాగా దగ్గరయ్యారు. 2019 ఎన్నికల్లో ఆయన టీడీపీ తరఫున ఓడిపోయారు. వైసీపీ అభ్యర్థి పెండెం దొరబాబు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ముఖ్యంగా జ్యోతుల నెహ్రూ కుటుంబం నుంచి ఎదురవుతున్న ఇబ్బందుల దృష్యానే వర్మ టీడీపీని వదిలిపెట్టి జనసేన వైపు చూస్తున్నారని చెబుతున్నారు.

మరోవైపు టీడీపీ కూడా తన పట్ల వ్యవహరిస్తున్న తీరు పట్ల వర్మ అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ కార్యక్రమాలకు ఆయన ఇటీవల దూరంగా ఉంటున్నారని పేర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్‌లో పవన్‌ కళ్యాణ్‌ని కలిసిన వర్మ జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారని చెబుతున్నారు. పిఠాపురంలో కాపు ప్రాబల్యం అత్యధికంగా ఉన్న సీటు కావడంతో ఈ సీటుపై వర్మ కన్నేశారని సమాచారం.

కాగా ఇక్కడ వచ్చే ఎన్నికల్లో జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్మ జనసేనలో చేరినా వర్మ టికెట్‌ దక్కించుకోవడం అంత తేలిక కాదంటున్నారు. మరోవైపు పిఠాపురంలో గత ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసిన మాకినీడి శేషుకుమారి మరోమారు పోటీ చేయడానికి సంసిద్ధమవుతున్నారు.

కాగా వర్మ పార్టీ మారితే టీడీపీ మరో అభ్యర్థిని వెతుక్కోక తప్పదు. వర్మ పార్టీ మారి జనసేనలో చేరితే నియోజకవర్గంలో టీడీపీలో ఉన్న కీలక నేతలంతా ఆయనతో నడిచే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో టీడీపీకి పిఠాపురంలో గట్టిదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది.  ఈ నేపథ్యంలో వర్మతో మాట్లాడి  శాంతింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News